- దర్జాగా ఓసీలు జారీ చేస్తూ కోట్లలో దండుకుంటున్న వైనం..
- ఇంత జరుగుతున్న నిద్రలో జోగుతున్న జీ.హెచ్.ఎం.సి అధికారులు..
- నకిలీ స్టాంపులు, డాక్యుమెంట్స్, ఐడీ కార్డులతో ఘరానా మోసం..
- నకిలీ ఉద్యోగి శివనాగేశ్వర రావుకు అధికారులకు లాలూచీ ఉందా..?
- అతగాడి అక్రమ సంపాదనలో ఎవరి వాటా ఎంతెంత..?
- పోలీస్ లకు అతగాడిని అప్పగించిన సబ్ రిజిస్ట్రార్ పీ. సంధ్యారాణి..
- ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి, విచారణ చేస్తామన్న మలక్ పేట్ సీఐ..
- సజావుగా విచారణ జరిగితే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయి
- ‘ఆదాబ్ హైదరాబాద’ ఫిర్యాదుతో వెలుగు చూసిన ఘటన..
జీ.హెచ్.ఎం.సి. అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ.. ప్రజా సంరక్షణలోనూ, ప్రజలకు సేవచేయడంలోనూ ముందు వరుసలో ఉండాలి.. పైగా ఇటీవల జీ.హెచ్.ఎం.సి. మూడు కార్పొరేషన్ లుగా విభజించారు.. ముగ్గురు కమిషనర్ల పాలనలో ఎంతో సజావుగా సాగుతుంది అనుకున్నాం.. కానీ అత్యంత అవినీతి విమర్శలు మూటగట్టుకున్న జీ.హెచ్.ఎం.సీ. మారకపోగా మూడు కార్పొరేషన్లుగా విడిపోయాక మరింత అవినీతి కూపంలో కూరుకుపోతోంది.. అసలు జీ.హెచ్.ఎం.సి. ఉద్యోగి కాని ఒక వ్యక్తి ఏకంగా నకిలీ డాక్యుమెంట్స్ తో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ కోట్లు దండుకుంటూ ఉంటే..
సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.. అయితే ఈ నకిలీ ఉద్యోగికి,(Fake GHMC Employee) అధికారులకు ఏదైనా లోపాయికారి ఒప్పొందం ఉందా..? వారి ప్రోద్భలంతోనే ఇంతటి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడా..? అన్న సందేహం కలుగుతోంది.. విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారుల సహకారం లేకుండా, ఇంత నిర్భయంగా అక్రమాలకు పాల్పడుతున్నాడంటే నమ్మశక్యం కాకుండా వుంది.. జీ.హెచ్.ఎం.సి., మూసారాంబాగ్ సర్కిల్ – 29లో వెలుగు చూసిన ఒక ఘటన ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. ఈ వివరాలు మీకోసం..

అతనొక నకిలీ ఉద్యోగి.. జీ.హెచ్.ఎం.సి.లో విధులు నిర్వహిస్తున్నానంటూ నమ్మిస్తాడు.. మూసారాంబాగ్ సర్కిల్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌కు సంబంధించిన ఐడీ కార్డును టాంపరింగ్ చేసి సీనియర్ అసిస్టెంట్ గా మార్చుకుని దాని ద్వారా నకిలీ స్టాంపులను, నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసి నిర్భయంగా, నిస్సిగ్గుగా నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నాడు.. తద్వారా కోట్ల రూపాయల జీ.హెచ్.ఎం.సి.కి రావాల్సిన నిధులను కొల్లగొడుతున్నాడు..
ఒక బిల్డింగ్ ఓసీ విషయంలో అనుమానం వచ్చిన ఆదాబ్ ప్రతినిథి ఆర్.టి.ఐ. ద్వారా ఆజంపురా సబ్ రిజిస్ట్రార్ పీ. సంధ్యారాణిని, డిప్యూటీ కమిషనర్ మూసారాంబాగ్ సర్కిల్ – 29 మంగతాయారును వివరాలు కోరగా నకిలీ ఉద్యోగి(Fake GHMC Employee) అయిన చీదెళ్ల శివనాగేశ్వర రావు భాగోతం బట్టబయలు అయ్యింది.. ఇదే విషయమై వారు రిప్లై ఇస్తూ.. అతను ఉద్యోగి కాదని, మేము ఎలాంటి ఓసీ రిలీజ్ చేయలేదని తెలిపారు.. కాగా గతంలో ఇతగాడు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ హౌస్ నెంబర్ 16-11-20/5/3/1, దిల్సుఖ్ నగర్, గడ్డిఅన్నారం ఫైల్ నెంబర్ 485222/1560/జీ.హెచ్.ఎం.సి./2025 గా తేలింది..
గురువారం మరో డాక్యుమెంట్ చేయడానికి అజాంపుర సబ్ రిజిస్టర్ ఆఫీసుకు రాగా సబ్ రిజిస్ట్రార్ పీ. జోసఫ్ ప్రేమ్ కుమార్ అనే జూనియర్ అసిస్టెంట్ ను పిలిచి అతడి గురించి అడుగగా అతను జీ.హెచ్.ఎం.సి. ఉద్యోగి కాదని నకిలీ ఉద్యోగి అని ఎస్.ఆర్.ఓ.కు తెలిపాడు.. కాగా విచిత్రం ఏమిటంటే పీ. జోసఫ్ ప్రేమ్ కుమార్ ఐడెంటిటీ కార్డును టాంపరింగ్ చేసి జూనియర్ అసిస్టెంట్ ప్లేస్ లో సీనియర్ అసిస్టెంట్ అని ఫోటోతో సహా మార్చి ఆ కార్డును ఉపయోగించుకోసాగాడు.. అతడు నకిలీ ఉద్యోగి అని తేలడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతగాడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా ఇతగాడితో వచ్చిన వారు పారిపోయారు.పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
కాగా ఇదే విషయమై ఆదాబ్ ప్రతినిధులు మలక్ పేట్ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటరెడ్డిని కలిసి వివరణ కోరగా.. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఎఫ్ ఐ ఆర్ చేసిన తరువాత వివరాలు చెబుతామని తెలిపాడు.. ఇబ్బడి ముబ్బడిగా ఇలాంటి వ్యవహారాల వలన ప్రభుత్వానికి కోట్ల రూపాయల గండి పడుతోంది.. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు జరిగినట్లు తెలుస్తోంది..

జీ.హెచ్.ఎం.సి.లో ఇంత నిర్భయంగా ఒక నకిలీ ఉద్యోగి ఏకంగా సబ్ రిజిస్ట్రార్‌కు వెళ్లి మార్టిగేజ్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాడంటే.. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.. ఇంత కాలం నుంచి ఆ నకిలీ ఉద్యోగిని గుర్తించకపోవడం దారుణం.. ఇది అధికారుల తప్పిదమా..? లేక అతడితో చేతులు కలిపి చేస్తున్న వ్యవహారమా..? అన్నది తేలాల్సి వుంది.. జీ.హెచ్.ఎం.సి.లో విజిలెన్స్ వ్యవస్థ ఉండికూడా ఈ మోసాన్ని గ్రహించలేక పోవడం దురదృష్టం.. నిజానికి ఈ వ్యవస్థ పనిచేస్తోందా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి..
ఇలాగే గతంలో కూడా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఇలాంటి వ్యవహారంపై పలుమార్లు ఆదాబ్ హైదరాబాద, పలు కథనాలను ప్రచురించినప్పటికీ ఇప్పటివరకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఎన్నిమార్లు హెచ్చరించినా అధికారుల్లో మార్పు రావడం లేదు.. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఎన్ని కోట్ల నష్టం జరిగివుంటుందో ఊహిస్తేనే ఆందోళన కలుగుతుంది.. చివరికి ఒక జర్నలిస్ట్ ఆర్.టి.ఐ. ద్వారా విషయం సేకరించి అధికారులకు తెలియజేస్తే తప్ప అధికారులు కళ్ళు తెరవడం లేదు.. ఇదిలా కొనసాగితే జీ.హెచ్.ఎం.సి. మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఎదురవుతుంది.. అసలు ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి..
జీ.హెచ్.ఎం.సి. మూసారాంబాగ్ సర్కిల్ – 29లో చోటు చేసుకున్న ఎలాంటి మకిలిపట్టిన, నకిలీ అక్రమ వ్యవహారాలపై సదరు నకిలీ ఉద్యోగి చీదెళ్ల శివనాగేశ్వర రావు చేసిన మరిన్ని అక్రమాలు, అసలు ఇతగాడి వెనక ఉన్నది ఎవరు..? ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారు అన్న విషయాలపై పూర్తి సమాచారంతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
