Homeఆరోగ్యంCare Hospitals | పొగాకు, కదలని జీవనశైలికి స్వస్తి..

Care Hospitals | పొగాకు, కదలని జీవనశైలికి స్వస్తి..

  • పిలుపునిచ్చిన కేర్ హాస్పిటల్స్‌..
  • ప్రపంచ హృదయ దినోత్సవం..
  • హైటెక్ సిటీ, మలక్‌పేట, ముషీరాబాద్‌లో
  • గుండె ఆరోగ్యంపై అవగాహన నడకలు..

గుండె సమస్య లక్షణాలు కనిపించాకే జాగ్రత్తపడాలనుకోవద్దని వైద్యులు సూచించారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్‌ (Care Hospitals) హైటెక్ సిటీ, మలక్‌పేట, ముషీరాబాద్ కేంద్రాల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన నడకలు నిర్వహించింది. వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. కేర్ హాస్పిటల్స్‌ చేపట్టిన ‘టైమ్ టు బ్రేకప్’ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడిని పట్టించుకోకపోవడం, ఆరోగ్య పరీక్షలను వాయిదా వేయడం వంటి అలవాట్లకు స్వస్తి చెప్పాలని ఈ ప్రచారం పిలుపునిస్తోంది.

హైటెక్ సిటీలో రెండు కిలోమీటర్ల అవగాహన నడక నిర్వహించారు. మలక్‌పేటలో కేర్ ఆసుపత్రి (Care Hospitals) బృందంతో పాటు స్థానికులు నడకలో పాల్గొన్నారు. ముషీరాబాద్‌లో కేర్ హాస్పిటల్స్‌ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు వెళ్లి, తిరిగి కేర్ హాస్పిటల్స్‌కు చేరుకున్నారు. మూడు కార్యక్రమాల్లో కేర్ హాస్పిటల్స్‌ రీజినల్ డైరెక్టర్‌ – కార్డియాలజీ, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గుల్లా సూర్యప్రకాశ్; హైటెక్ సిటీ క్లినికల్ డైరెక్టర్‌, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కృష్ణమోహన్; మలక్‌పేట సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్; హైటెక్ సిటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ భవానీ ప్రసాద్; మలక్‌పేట హెచ్‌సీఓఓ ప్రవీణ్ కుమార్ ఎడ్ల; సీటీవీఎస్ నిపుణుడు డాక్టర్ సుధీర్ గండ్రకోట; క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ రాజేంద్ర వజ్రపు; ముషీరాబాద్ హెచ్‌సీఓఓ డాక్టర్ భారతి జెట్టి తదితరులు పాల్గొన్నారు. మలక్‌పేట నడకకు డాక్టర్ నవీన్ కుమార్, ముషీరాబాద్ నడకకు డాక్టర్ గుల్లా సూర్యప్రకాశ్ నాయకత్వం వహించారు.

- Advertisement -

డాక్టర్ గుల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ, “గుండె జబ్బులు చాలా సందర్భాల్లో ఏళ్ల తరబడి నిశ్శబ్దంగా పెరుగుతాయి. మనం ఏం తింటున్నాం, ఎంత కదులుతున్నాం, ధూమపానం చేస్తున్నామా, రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తెలుసుకుంటున్నామా అన్నవి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఛాతీనొప్పి లేదా మరో హెచ్చరిక వచ్చే వరకు ఆగొద్దు. గుండెకు హాని చేస్తున్న ఒక అలవాటును గుర్తించి, ఈ రోజే దాన్ని మార్చడం ప్రారంభించాలి” అని చెప్పారు.

డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ, “గుండె జబ్బు తొలిదశలో స్పష్టమైన హెచ్చరిక ఇవ్వకపోవచ్చు. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ ఏళ్ల తరబడి గుర్తించకుండా ఉండిపోవచ్చు. క్రమం తప్పకుండా నడవాలి. పొగాకుకు దూరంగా ఉండాలి. ఆహారం, నిద్రపై శ్రద్ధ పెట్టాలి. రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తెలుసుకోవాలి. చిన్న మార్పులైనా నిరంతరం పాటిస్తే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది” అని తెలిపారు.

డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, “లక్షణాలు కనిపించే వరకు గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కరోజులో అన్ని అలవాట్లనూ మార్చుకోవాల్సిన అవసరం లేదు. రోజూ నడవడం, మంచి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం లేదా పొగాకు మానేయడం – వీటిలో ఒకదానితో మొదలుపెట్టి, దాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి” అని సూచించారు. ‘టైమ్ టు బ్రేకప్’ ప్రచారం ద్వారా గుండెకు హాని చేసే ఒక అలవాటునైనా వదిలేయాలని కేర్ హాస్పిటల్స్‌ కోరింది. శారీరక శ్రమ పెంచుకోవడం, పొగాకుకు దూరంగా ఉండడం, ఆహారం, నిద్ర, ఒత్తిడిపై శ్రద్ధ పెట్టడంతో పాటు అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవాలని సూచించింది. (https://epaper.aadabhyderabad.in/) (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News