- ప్రత్యర్థుల ఇళ్లపై వైసీపీ దాడులు..
- రాజకీయం చేయడం జగన్ వంతు..
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే… వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లాలో వ్యక్తిగత దూషణల సాకుతో ఒక దళిత వ్యక్తి ఇంటిపై పడి దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే, నాయకులపై పోలీసులు చట్టప్రకారం విచారణ జరిపి అరెస్ట్ చేస్తే, దాన్ని అరాచక పాలన అంటూ జగన్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. “ఒక ఎమ్మెల్యేకి ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం ఉండదు జగన్” అని అన్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఆధారాలను పరిశీలించి జడ్జి రిమాండ్ విధిస్తే, దాన్ని కూడా రాజకీయం చేయడం జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇంట్లో చొరబడి వస్తువులను ధ్వంసం చేసిన ఆధారాలు, వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నా జగన్ విడ్డూరంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి యాక్సిడెంట్ ఉదంతంలో బాధితులను బెదిరించినప్పుడు కూడా సమర్థించిన జగన్, ఇప్పుడు కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించడం ఆనవాయతీ అని… కానీ, చంపిన వారి ఇళ్లకు వెళ్లి ఓదార్చడం ఒక్క జగన్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. అరాచక పాలనకు పేటెంట్ రైట్స్ ఉన్నది జగన్‌కేనని, యన పాలనలోని అరాచకాలను తట్టుకోలేకే ప్రజలు వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తుచేశారు. నారా లోకేశ్ విసిరిన డీఎస్సీ సవాల్‌కు అసెంబ్లీకి వచ్చి చర్చించే ధైర్యం లేక జగన్ తన అనుచరులతో మాట్లాడిస్తున్నారని ఎద్దేవా చేశారు. చివరికి మహిళా ఎస్సైపై వైసీపీ నేత దాడికి యత్నించినా జగన్ ఖండించలేదని మండిపడ్డారు.
