Homeఆదిలాబాద్Nirmal Collector | ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల డ్రపౌట్ లేకుండా చూడాలి

Nirmal Collector | ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల డ్రపౌట్ లేకుండా చూడాలి

  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల డ్రాపౌట్ లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో విద్యాశాఖపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న బోధన, సౌకర్యాలు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి రోజూ తప్పనిసరిగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేయాలని చెప్పారు. ఉపాధ్యాయుల హాజరు రోజూ 90 శాతానికి తగ్గకుండా ఉండాలని పేర్కొన్నారు. నూతన విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ మిగిలి ఉంటే పూర్తి చేయాలని ఆదేశించారు. బడికి తరచూ రాని, దీర్ఘకాలికంగా హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారు తరగతులకు వచ్చే విధంగా చొరవ చూపాలని అన్నారు. విద్యార్థుల అపార్ ఐడి నమోదు పూర్తి చేయాలని చెప్పారు.

- Advertisement -

అపార్ ఐడి నమోదులో సాంకేతిక ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పిల్లలకి ఎవరికైనా ఆధార్ కార్డ్ లేనట్లయితే, వారు ఆధార్ కార్డు పొందేలా కృషి చేయాలన్నారు. పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల సంఖ్య మరింత పెంచేలా చూడాలన్నారు. అధునాతన బోధనా పద్ధతులు, బృంద చర్చలు, విద్యార్థులు – ఉపాధ్యాయుల ముఖాముఖి, నిరంతర ప్రోత్సాహం వంటి అంశాల ద్వారా చదువులో వెనుకబడిన పిల్లల ప్రగతికి పాటుపడాలన్నారు.

ఎప్పటికప్పుడు పోషకులతో సమావేశాలు నిర్వహిస్తూ, అన్ని విషయాలు చర్చించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎం లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News