- వరుసగా కంపెనీని వీడుతున్న ఉద్యోగులు..
- ఆంథ్రోపిక్ లో చేరుతున్న వైనం..
గూగుల్ ఏఐ విభాగం డీప్‌మైండ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత కొన్ని వారాల్లో నలుగురు సీనియర్ ఏఐ నిపుణులు కంపెనీని వీడారు. వీరిలో ఎక్కువ మంది లండన్ కేంద్రంగా పనిచేసిన వారే కావడం ఆసక్తి రేపుతోంది. వీరిలో జోనాస్ అడ్లర్, అలెగ్జాండర్ ప్రిట్జెల్ తాజాగా గూగుల్‌కు రాజీనామా చేసి ఆంథ్రోపిక్‌లో చేరనున్నట్లు సమాచారం. వీరిద్దరూ జెమినీ ఏఐ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినవారిగా గుర్తింపు పొందారు.
ఇప్పటికే ఆల్ఫాఫోల్డ్‌కు సహ-నేతృత్వం వహించిన నోబెల్ గ్రహీత జాన్ జంపర్, ట్రాన్స్‌ఫార్మర్ టెక్నాలజీ రూపకర్తల్లో ఒకరైన నోమ్ షజీర్ కూడా గూగుల్‌ను వీడారు. జాన్ జంపర్ ఆంథ్రోపిక్‌లో చేరనున్నప్పటికీ, బ్రిటన్‌లో అమల్లో ఉన్న నాన్-కంపీట్ నిబంధనల కారణంగా వచ్చే ఏడాది మాత్రమే కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఏఐ రంగంలో కీలక పరిశోధనలు క్రమంగా అమెరికాలోని కాలిఫోర్నియాకు మారుతున్నాయనే అభిప్రాయం కూడా బలపడుతోంది. మోడళ్లకు శిక్షణ ఇచ్చే ప్రీ-ట్రైనింగ్ పనులపై దృష్టి అమెరికాకు మళ్లడంతో, లండన్‌లో పనిచేస్తున్న పరిశోధకులు కూడా అక్కడి కంపెనీల వైపు అడుగులు వేస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. గూగుల్ కూడా కంప్యూటింగ్ వనరుల కేటాయింపులో మార్పులు చేయడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది.
