Wednesday, July 1, 2026
Homeఅంతర్జాతీయంEnvironment | ప్రగతి ముసుగులో ప్రకృతి వినాశనం - ప్రమాదంలో జీవ జాతులు

Environment | ప్రగతి ముసుగులో ప్రకృతి వినాశనం – ప్రమాదంలో జీవ జాతులు

ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మానవాళి సాధిస్తున్న అపారమైన ప్రగతి మరియు ఆర్థిక వృద్ధి వెనుక ప్రకృతి మాత నిశ్శబ్ద రోదన దాగి ఉంది. భూగోళం నలుమూలలా పర్యావరణ వ్యవస్థలు కుప్పకూలుతుంటే, గ్లోబల్ వార్మింగ్ సెగలు ఊపిరి సలపనివ్వకుండా చేస్తుంటే, ఐక్యరాజ్యసమితి వేదికలపై నుండి గల్లీ రాజకీయాల వరకు వినిపించే నినాదాలు కేవలం ఆచరణ శూన్యమైన మాటలుగానే మిగిలిపోతున్నాయి.

పర్యావరణ పరిరక్షణ అనేది ఏదో జూన్ 5వ తేదీన మొక్కలు నాటి ఫొటోలు దిగే వార్షికోత్సవ వేడుక కాదు; అది భూమిపై జీవం మనుగడకు సంబంధించిన అత్యంత కీలకమైన జీవన్మరణ సమస్య. ప్రకృతిని వ్యాపారంగా మార్చిన నాడు పతనం మొదలైంది. చట్టాలు కాగితాలకే పరిమితమైతే రేపటి తరం శ్వాస కోసం అల్లాడిపోతుంది.

- Advertisement -

పాలకుల రెండు నాలికల ధోరణి – కార్పొరేట్ శక్తుల దోపిడీ

​ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) తాజా నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 70 లక్షల మంది కేవలం వాయు కాలుష్యం వల్లే అకాల మరణం పాలవుతున్నారు. అంటే నిమిషానికి 13 మంది వాయు కాలుష్యానికి బలైపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో 9 మంది కాలుష్య గాలిని పీలుస్తున్నారనేది నేటి భయంకర వాస్తవం.

​పారిశ్రామికీకరణ, ఆర్థిక వృద్ధి పేరిట ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోపిడీ చేయడానికి పరోక్షంగా అనుమతులిస్తూ, మరోవైపు పర్యావరణ పరిరక్షణ చట్టాలంటూ కంటితుడుపు చర్యలకు దిగడం ప్రభుత్వాల రెండు నాలికల ధోరణికి అద్దం పడుతోంది. ఓట్ల కోసం చట్టాలు చేసే పాలకులు, నోట్ల కోసం ప్రకృతిని విక్రయిస్తే వినాశనానికి కాలపట్టిక సిద్ధమైనట్లేనని గ్రహించాలి. ప్రస్తుత ప్రపంచంలో పర్యావరణ సమస్యలు కేవలం ప్లాస్టిక్ వాడకానికో, వాహనాల పొగకో పరిమితం కాలేదు, కార్పొరేట్ శక్తుల దురాశకు పాలక వర్గాలు మద్దతుగా నిలబడటమే అన్నిటికంటే పెద్ద పర్యావరణ విపత్తుగా మారింది.

​ఆరవ మహా వినాశనం – మూగబోతున్న అడవులు, నదులు

​అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం 10 మిలియన్ హెక్టార్ల అడవులు నరికివేతకు గురవుతుంటే, భారతదేశంలో గడచిన కొన్ని దశాబ్దాలుగా లక్షలాది హెక్టార్ల అటవీ భూమిని మైనింగ్, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం మళ్లించారు. ఛత్తీస్‌గఢ్‌లోని హస్డియో అరంద్ అడవుల నిలువునా నరికివేత, పశ్చిమ కనుమలలో జరుగుతున్న విచ్చలవిడి క్వారీయింగ్ ఇందుకు సజీవ సాక్ష్యాలు.

అభివృద్ధి అనే భ్రమను సృష్టించి, మైనింగ్ ల కోసమో, భారీ ప్రాజెక్టుల కోసమో శతాబ్దాల నాటి అడవులను కూలుస్తుంటే ప్రభుత్వాలు మూగప్రేక్షకుడిలా ఉండిపోతున్నాయి. అడవులను నరుకుతున్నప్పుడు కేవలం చెట్లను మాత్రమే కాకుండా, కోట్లాది జీవుల గృహాలు, భూమి ఊపిరితిత్తులు శాశ్వతంగా సమాధి అవుతున్నాయి

​అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (IUCN) మరియు వరల్డ్ వైడ్‌లైఫ్ ఫండ్ (WWF) లివింగ్ ప్లానెట్ నివేదిక ప్రకారం, గడచిన 50 ఏళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల జనాభా 69% పైగా క్షీణించింది. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, ప్రస్తుతం భూమిపై ఉన్న సుమారు 10 లక్షల జీవజాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.

డైనోసార్ల కాలం నాటి ఐదు మహా వినాశనాల తర్వాత, మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న ఈ ఆరవ మహా వినాశనం గత వందల రెట్ల కంటే వేగంగా సాగుతోంది. భూమిపై ప్రతి జీవికీ ఒక హక్కు ఉంది, అది మానవుడి స్వార్థానికి బలికావడానికి పుట్టలేదు, జీవవైవిధ్యం అంతరిస్తే మానవ మనుగడకు అంతిమ ఘడియలు ప్రారంభమైనట్లే.

​చట్టాలు కేవలం సామాన్యుడిని నియంత్రించడానికే అన్నట్లుగా మారాయి తప్ప, గంగా, యమునా, గోదావరి వంటి జీవ నదులను రసాయన మురుగు కాలువలుగా మారుస్తున్న బహుళజాతి కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా అరుదు. పర్యావరణ ప్రభావ అంచనా (EIA) వంటి కీలకమైన నిబంధనలను సైతం బడా పరిశ్రమలకు అనుకూలంగా సడలిస్తూ, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసే నిర్ణయాలకు ప్రభుత్వాలు వెనుకాడటం లేదు. చట్టసభల్లో పర్యావరణంపై జరిగే చర్చలు కేవలం బడ్జెట్ కేటాయింపులకే పరిమితమవుతున్నాయి తప్ప, వాటి క్షేత్రస్థాయి అమలును పర్యవేక్షించే గట్టి యంత్రాంగం కరువైంది.

​కరుగుతున్న మంచు, కరువవుతున్న శ్వాస – ప్రకృతి అంతిమ హెచ్చరికలు

​నదులు ఎండి పోయాక, గాలి విషపూరితమయ్యాక మీ కరెన్సీ కట్టలు మీ ఆకలిని తీర్చలేవు, మీ శ్వాసను నిలపలేవు. ఈ పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలు నేడు వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 4.20 PPM మైలురాయిని దాటేశాయి, పారిశ్రామిక విప్లవానికి ముందు ఇది కేవలం 2.80 PPM మాత్రమే ఉండేది. అంతర్-ప్రభుత్వ వాతావరణ మార్పుల సంఘం (IPCC) నివేదికల ప్రకారం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.2 ట్రిలియన్ టన్నుల మంచు కరిగిపోతోంది.

​దీని ప్రభావం వల్ల జాతీయంగా, అంతర్జాతీయంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, బ్రెజిల్ వరదలు, ఆఫ్రికా కరువులు, భారతదేశంలో ఎల్-నినో ప్రభావంతో సంభవిస్తున్న అకాల వర్షాలు, తీవ్రమైన హీట్ వేవ్స్, మరియు ధృవపు జీవుల వినాశనం మానవాళికి ప్రకృతి ఇస్తున్న అంతిమ హెచ్చరికలు. సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి గ్రేట్ బారియర్ రీఫ్ వంటి పగడపు దిబ్బలు చనిపోతున్నాయి, సముద్ర జీవుల నర్సరీలుగా పిలవబడే పగడపు దిబ్బల వినాశనం సముద్ర జీవవైవిధ్యాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తోంది.

​పర్యావరణాన్ని ఒక సిద్ధాంతంగా, ఒక జీవన విధానంగా కాకుండా కేవలం పొలిటికల్ అజెండాగా మార్చినప్పుడు ఇలాంటి విపత్తులే సంభవిస్తాయి. గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్ అంటూ ప్రగల్భాలు పలికే దేశాలు సైతం, తెరవెనుక బొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నియంత్రించలేకపోతున్నాయి.

పారిస్ పర్యావరణ ఒప్పందంలో భూగోళ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5°C కి పరిమితం చేయాలని తీర్మానించినప్పటికీ, ఏ ఒక్క పారిశ్రామిక దేశం కూడా ఆ లక్ష్యానికి అనుగుణంగా ఉద్గారాలను తగ్గించడంలో నిజాయితీతో కూడిన కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఒకవైపు పర్యావరణ రక్షణకు నిధులు కేటాయిస్తూనే, మరోవైపు పర్యావరణాన్ని ధ్వంసం చేసే ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపడం ప్రభుత్వాల పతనావస్థకు నిదర్శనం.

​పౌర సమాజపు నిశ్శబ్దం – ‘ప్రకృతి వాదం’ వైపు అడుగులు

​ఇక్కడ మనం కేవలం పాలకులను, కార్పొరేట్ శక్తులను మాత్రమే బోనులో నిలబెడితే సరిపోదు, ఈ పర్యావరణ పతనంలో సగటు పౌరుడి నిశ్శబ్దం, నిర్లక్ష్యం కూడా సమాన భాగస్వామ్యం వహిస్తున్నాయి. హక్కుల కోసం పోరాడే పౌరుడు, బాధ్యతను మరచి జీవిస్తే వ్యవస్థల వైఫల్యానికి సమాజమే మూల్యం చెల్లించాలి. ఆధునిక మానవుడు వినియోగదారీ సంస్కృతి అనే మాయలో పడి ప్రకృతిని తన సొంత జాగీరులా భావిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, అందులో సగం కేవలం ఒక్కసారి వాడి పారేసే సింగిల్-యూజ్ ప్లాస్టిక్కే కావడం గమనార్హం.

​ఈ రోజు గ్రామాల్లో మరియు నగరాల్లో పిచ్చుకలు, సీతాకోకచిలుకలు, కప్పలు, తేనెటీగలు వంటి అద్భుత జీవరాశులు అదృశ్యమవడానికి కారణం మనం విచ్చలవిడిగా వాడుతున్న రసాయన క్రిమిసంహారకాలు మరియు మొబైల్ టవర్ల రేడియేషన్లే. నదులు కలుషితమవుతుంటే ప్రభుత్వాల వైఫల్యమని నిందించే పౌరుడు, తన ఇంట్లో ఉత్పత్తయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలను, రసాయనాలను అదే నదుల్లోకి చేర్చే డ్రైనేజీ వ్యవస్థలో కలపడానికి వెనుకాడటం లేదు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన చెందే సమాజం, వర్షపు నీటిని ఒడిసి పట్టే ఇంకుడు గుంతల వంటి కనీస ప్రయత్నాలను కూడా విస్మరిస్తోంది.

బాధ్యతా రాహిత్యం ఎంతగా పెరిగి పోయిందంటే, పౌరుడు తన స్వల్పకాలిక సౌకర్యాల కోసం పర్యావరణ విలువలన్నింటినీ పణంగా పెడుతున్నాడు. అవసరం లేకపోయినా విలాసవంతమైన… వాహనాల వాడకం, విచ్చలవిడిగా ఏసీల వినియోగం వల్ల వెలువడే CFC ఉద్గారాలు, చెత్తను బహిరంగంగా తగుల బెట్టడం వంటి రోజువారీ చర్యలు పరోక్షంగా గ్లోబల్ వార్మింగ్‌ను పెంచుతున్నాయి.

‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్’ నివేదిక ప్రకారం మన దేశంలో 60% పైగా పక్షి జాతులు క్షీణత బాటలో ఉన్నాయి. ఓటు వేసేటప్పుడు పాలకుల పర్యావరణ విధానాలను, వారి గత చరిత్రను ప్రశ్నించని పౌరసమాజం ఉన్నంతకాలం, పాలకులకు పర్యావరణంపై బాధ్యత ఉండదు. ప్రజా చైతన్యం లేని చోట చట్టాలు నిరర్థకమైన అక్షరాలుగా మిగిలిపోతాయి.

​అభివృద్ధి పేరిట అడవులను నరికి కాంక్రీట్ సామ్రాజ్యాలు కడితే, రేపటి తరం శ్వాసించడానికి ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ వినాశకరమైన ధోరణి మారాలంటే ఒక సరికొత్త సైద్ధంతిక విప్లవం రావాలి. పాలకులు తమ ఆర్థిక విధానాలను కేవలం జీడీపీ (GDP) వృద్ధి ఆధారంగా కాకుండా, పర్యావరణ కేంద్రక విధానాలుగా (Eco-centric Economy) మార్చుకోవాలి.

పర్యావరణ విధ్వంసానికి పాల్పడే శక్తులు ఎంతటి వారైనా సరే, వారిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) మరియు అంతర్జాతీయ పర్యావరణ చట్టాల ప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకునే నైతిక స్థైర్యాన్ని ప్రభుత్వాలు ప్రదర్శించాలి. కేవలం చట్టాలు చేయడం కాదు; భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని అనే పంచభూతాల సమతుల్యతను కాపాడటమే నిజమైన పరిపాలన అని నమ్మే నాయకత్వం నేడు మానవ సమాజానికి అవసరం.

పౌర సమాజంలో హరిత చైతన్యం

​దీనికి సమాంతరంగా పౌర సమాజంలోనూ హరిత చైతన్యం ఉదయించాలి, ప్రతి పౌరుడూ పర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక విధిగా స్వీకరించాలి. విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచే పాఠ్యాంశాల్లో పర్యావరణ విలువలని, ప్రకృతితో మమేకమయ్యే జీవనవిధానాన్ని, అంటే ప్రకృతి వాదాన్ని తప్పనిసరిగా బోధించాలి. వ్యక్తిగత జీవితంలో ప్లాస్టిక్ రహిత జీవనం, తగ్గించడం-మరల వాడటం-పునరుత్పత్తి (3Rs: Reduce, Reuse, Recycle) సూత్రాన్ని పాటించడం, నీటి పొదుపు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం, స్థానిక అడవుల రక్షణ మరియు జీవవైవిధ్యాన్ని గౌరవించడం ప్రతి ఇంటా ఒక సంస్కృతిగా మారాలి.

అప్పుడే, కేవలం కాగితాలపై ఉండే చట్టాలు కాకుండా, ప్రజల గుండెల్లోనూ, పాలకుల చర్యల్లోనూ నిజమైన మార్పు వస్తుంది. లేనిపక్షంలో, ప్రకృతి తనపై జరుగుతున్న ఈ మానవ వికృతానికి ప్రకోపిస్తే, ఆ విధ్వంసం ముందు ఏ ప్రభుత్వాలు, ఏ సామ్రాజ్యాలు, ఏ ఆధునిక సాంకేతికతలూ నిలబడలేవనేది తిరుగులేని చారిత్రక సత్యం.

విశ్వ జంపాల, న్యాయవాది
విశ్వ సమాజం వ్యవస్థాపకులు

- Advertisement -
RELATED ARTICLES

Latest News