- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఈనెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 28వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు.

ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, పోలియో చుక్కల ప్రాధాన్యతను వివరించాలని చెప్పారు. జూన్ 28వ తేదీ తర్వాత కూడా సిబ్బంది ఇంటింటికి వెళ్లి, చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. అలాగే రానున్న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

