- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా విద్యా బోధన సాగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని (కేజీబీవీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తరగతిగదిలోని విద్యార్థులతో కలెక్టర్ పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగారు. వారితో లెక్కలు చేయించారు. విద్యార్థులు పాఠాలను సులువుగా అర్థం చేసుకునే మెలుకువలు నేర్చుకోవాలన్నారు. సామాజిక అంశాల్లో భాగస్వామ్యం అవుతూ పలు విషయాల్లో అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు నేర్పిస్తున్న చదువు, అందిస్తున్న భోజనం సక్రమంగా ఉన్నాయో లేవో వారిని అడిగి తెలుసుకున్నారు.


అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, పిల్లలకు చదువుతో పాటు, నైపుణ్యాభివృద్ధి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు వచ్చే సందేహాలు నివృత్తి చేస్తూ ఉండాలని తెలిపారు. ప్రతి రోజు అన్ని పూటల కామన్ మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని చెప్పారు. విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు.
అనంతరం ఖానాపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులు పరిశీలించారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని చెప్పారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఏవైనా భూ సమస్యలు ఉన్నాయేమో అని అడిగి తెలుసుకున్నారు.
ఈ తనిఖీలలో డిఈఓ భోజన్న, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రాధా రాథోడ్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
