- రికార్డు స్థాయికి చేరిన పాక్ లో పెట్రోల్ ధర..
- దిగ్బ్రాంతికి గురౌతున్న పాక్ ప్రజానీకం..
పాకిస్థాన్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఇలాంటి గడ్డు కాలంలో అమెరికా, ఇరాన్ మధ్య రేగిన యుద్ధ వాతావరణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్ల పైకి చేరాయి.
చమురు దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడే పాకిస్థాన్‌పై ఈ గ్లోబల్ సంక్షోభం నేరుగా ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లను తట్టుకోలేక, మే మొదటి వారంలో అక్కడి ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ. 14.92 మేర పెంచింది. దీనితో పాకిస్థాన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర గరిష్ఠంగా రూ. 414.78 కి చేరి దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
అయితే, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంధన ధరలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చేలా పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ. 5 మేర స్వల్పంగా తగ్గించారు.
ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 409.78 (సుమారు రూ. 410) పలుకుతుండగా, హై-స్పీడ్ డీజిల్ ధర కూడా లీటరుకు రూ. 409.58 వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ సమీక్షలో ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, సామాన్య ప్రజల కోణం నుంచి చూస్తే లీటరుకు రూ. 410 అనేది ఇంకా మోయలేని భారంగానే మిగిలిపోయింది.
