- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
ప్రభుత్వ బడుల్లో, విద్యార్థుల సామర్థ్యాల పెంపుదలనే లక్ష్యంగా విద్యాబోధన సాగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారితో మాట్లాడుతూ, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి రావాలని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అన్ని శ్రద్ధగా వినాలని పేర్కొన్నారు.

వేసవికాలం వల్ల మధ్యాహ్నం నుంచి పాఠశాలకు సెలవు ఉంటుందని, మధ్యాహ్నం వేళల్లో ఎండ అధికంగా ఉన్నందున విద్యార్థులు బయట తిరగకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. భోజనశాల లేదన్న విషయం విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన కలెక్టర్ భోజనశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, ప్రతిరోజు విద్యార్థులందరికీ ప్రతిరోజు శుచి శుభ్రతలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. పిల్లలకు ఎటువంటి సమస్యలు కలగకుండా చూసుకోవాలని వివరించారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాఠశాల ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ, ఇప్పటివరకు పూర్తయిన పరీక్షలు, ఇంకా మిగిలి ఉన్న పరీక్షల వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. పరీక్షలపై ఎటువంటి భయం అవసరం లేదని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. విద్యార్థులతో బోర్డుపై గణితం లెక్కలను చేయించారు.

అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం నాణ్యవంతంగా ఉందని ప్రశంసించారు. మిగతా పనినంతటిని త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలన్నారు.
ఈ తనిఖీలలో డీఈవో భోజన్న, తహసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మికాంత రావు, సర్పంచ్ సాయన్న, పంచాయితీ కార్యదర్శి సౌజన్య, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
