- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిర్దేశించిన అన్ని పనులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. పెండింగ్ ఫైల్స్ మొత్తం పరిష్కరించాలని తెలిపారు. రానున్న వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామ సభలు నిర్వహించాలన్నారు. వైద్యారోగ్య శాఖకు నిర్దేశించిన అన్ని లక్ష్యాలు పూర్తి చేయాలని వివరించారు.

అధికారులు ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనం చేసి, నాణ్యత తనిఖీ చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తనిఖీలు చేయాలన్నారు. తప్పనిసరిగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ప్రజాప్రతినిధులకు ముందుగా అందించి, వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అన్ని అంశాలను పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఆర్డిఓ విజయలక్ష్మి, సిపిఓ జీవరత్నం, డిఎంహెచ్ఓ రాజేందర్, డిపివో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, డీఈఓ భోజన్న, హౌసింగ్ పిడి రాజేశ్వర్, లు పాల్గొనగా.. మండల కేంద్రాల నుంచి తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈఓలు, తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
