- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి (జిల్లా ఇన్ చార్జి మంత్రి) జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మంత్రి జూపల్లి, ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి, ఎంపీ గోడం నగేష్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలందరికీ క్షేత్రస్థాయిలో మెరుగ్గా అందాలన్న ఉద్దేశ్యంతో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 99 రోజులపాటు, అన్ని శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుధ్య పనులు చేపట్టాలని వివరించారు. పెండింగ్ లో ఉన్న ఫైల్స్ లను పరిష్కరించాలని పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాల్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలకు కేటాయించిన పనులన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, వైద్యారోగ్య కార్యక్రమాలు, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన, అరైవ్ అలైవ్ కార్యక్రమం, తదితర కార్యక్రమాలన్నీ ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అన్నారు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సంయుక్త భాగస్వామ్యంతో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణను స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు అందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్, భైంసా ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సోమ భీమ్ రెడ్డి, షిండే ఆనంద్ రావు పటేల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
