- కష్టమే విజయానికి మెట్టుగా స్థానిక స్థాయి నుంచి జాతీయ వేదికలలో ప్రదర్శన
- సీతాఫలమండి యువతకు స్ఫూర్తి–అభినందనల వెల్లువ
- వయసు చిన్నది విజయాలు పెద్దవి
సీఎం కప్ వెయిటలిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం (ఎల్.బి. స్టేడియం)లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో సికింద్రాబాద్, సీతాఫలమండి, బీదలబస్తీకి చెందిన జి.యం. రేవంత్ తన ప్రతిభను చాటుతూ 65 కేజీల విభాగంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనబరుస్తున్న రేవంత్ భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.65 కేజీల విభాగంలో పోటీపడిన రేవంత్ అద్భుతమైన లిఫ్టింగ్ ప్రదర్శనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాడు.
తన శక్తి,సాంకేతిక నైపుణ్యం,పట్టుదలతో ఇతర క్రీడాకారులను వెనక్కి నెట్టి బంగారు పతకాన్ని సాధించాడు.ప్రతి రౌండ్‌లోనూ స్థిరమైన ప్రదర్శన కనబరిచి తన ప్రతిభను రుజువు చేశాడు. చిన్న వయసులోనే ఇంతటి స్థాయి ప్రదర్శన ఇవ్వడం విశేషంగా నిలిచింది.సికింద్రాబాద్ ప్రాంతంలో సాధారణ వాతావరణంలో సాధన ప్రారంభించిన రేవంత్,క్రమశిక్షణతో శిక్షణ తీసుకుంటూ ఎదిగాడు.కోచ్‌ల మార్గదర్శకత్వం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం,తన అచంచల సంకల్పం కలిసి ఈ విజయాన్ని సాధించేందుకు దోహదపడ్డాయి.

ఇప్పటికే పలు జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధిస్తూ తన ప్రతిభను చాటుతున్న ఈ యువ క్రీడాకారుడు,అంతర్జాతీయ వేదికలపై కూడా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.రేవంత్ విజయం పట్ల కుటుంబ సభ్యులు,కోచ్‌లు,స్థానిక యువకులు హర్షం వ్యక్తం చేశారు.సికింద్రాబాద్,సీతాఫలమండి ప్రాంత ప్రజలు గర్వంగా భావిస్తున్నారు.స్థానిక ప్రజాప్రతినిధులు,క్రీడాభిమానులు రేవంత్‌ను అభినందిస్తూ,యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తున్న జి.యం.రేవంత్ రాబోయే రోజుల్లో దేశానికి పేరు తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
