ప్రముఖ సినీ గీత రచయిత(Film Lyricist), పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Seetharama Sastry) కాంస్య విగ్రహవిష్కరణ(Bronze sculpture Unveiled) ఆదివారం ఘనంగా జరిగింది. తానా సాహిత్య విభాగం-తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనకాపల్లి గాంధీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరిగిన ఈ విగ్రహావిష్కరణకు మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన వహించారు. సుప్రసిద్ధ సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్(Film director Trivikram Srinivas) చేతుల మీదగా సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యుల మధ్య విగ్రహావిష్కరణ చేశారు.
అనంతరం.. పెంటకోట కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ(MLA Konatala Ramakrishna) అధ్యక్షతన సిరివెన్నెల సీతారామశాస్త్రి మహోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. రథసప్తమి రోజున అనకాపల్లిలో పుట్టి అనకాపల్లిలో పెరిగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యవేత్తగా, గేయ రచయితగా అనకాపల్లికి గౌరవం తీసుకొచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహావిష్కరణ ఆయన పుట్టిన ప్రాంతంలో ఆయన తిరిగిన ప్రాంతం గాంధీనగర్‌లో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెప్పారు. విగ్రహావిష్కరణకు సిరివెన్నెల సీతారామశాస్త్రి అల్లుడు, మంచి అభిమాని అయిన ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావడం, వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగటం విశేషమని తెలిపారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి కళాపీఠం ఏర్పాటుచేసి ఏటా అవార్డు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, ఈ ఏడాది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి చేశామని పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటుకు తానా ప్రపంచ సాహిత్య వేదిక సహకారం అందించారని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లినా పుట్టిన ఊరు, పెరిగిన వీధిలో సిరివెన్నెల విగ్రహావిష్కరణ అనేది యాదృచ్ఛికంతోపాటు దైవ సంకల్పం అని చెప్పారు. ఏటా సిరివెన్నెల కళాపీఠం పేరిట అవార్డ్‌ను సాహిత్యవేత్తలకు ఇస్తామన్నారు.
జీవంతో ఉన్నా లేకున్నా మనుషుల మనసుల్లో సజీవంగా నిలిచేది కొందరే అని ప్రముఖ సినీ దర్శకులు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాంటివారిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరన్నారు. అనకాపల్లి సిరివెన్నెల వంటి ఎందరికో పుట్టినిల్లు అన్నారు. మహనీయుల చరిత్ర.. తర్వాత తరాలవారికి తెలియాలన్నా, స్పూర్తి పొందాలన్నా ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు అవసరమన్నారు. ఏ మనిషిని అయినా తన ఆలోచనలే ఉన్నత స్థితికి తీసుకెళ్తాయన్నారు.
మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సాహిత్యాన్ని పరుగులు పెట్టించిన వ్యక్తి సిరివెన్నెల అన్నారు. మానవీయ విలువలను ప్రతిబింబించేలా ఆయన పాటలు సాగాయన్నారు. సహజంగా దేశభక్తుడు అయిన ఆయన.. పాటల రూపంలో దేశభక్తిని చాటి చెప్పారన్నారు. కొణతాల సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.
తానా సభ్యుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. 20 ఏళ్ల టెలిఫోన్ ఉద్యోగం వదిలేసి సినీ ఇండస్రీలోకి అడుగుపెట్టడం సాహసమేనని అన్నారు. సిరివెన్నెల చిత్రంతో తనకంటూ ప్రత్యేకత చరిత్ర సృష్టించారన్నారు. వరుసగా మూడు సినిమాల్లో మూడు నంది అవార్డులు అందుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో సిరివెన్నెల కుటుంబ సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా జనసేన ఇన్‌ఛార్జ్ రాంకీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని, సిరివెన్నెల కుటుంబ సభ్యులను సత్కరించి గౌరవించారు.
