- జీహెచ్ఎంసి కౌన్సిల్ వేదికే పరీక్షా స్థలం
- వార్డుల విభజనపై కౌన్సిల్‌లో సభ్యుల అభ్యంతరాలు
- ప్రిలిమినరీ నోటిఫికేషన్–పబ్లిక్ క్లారిటీ ఎక్కడని ప్రశ్నలు ?
- మ్యాప్‌లేకుండా బౌండరీస్ నిర్ణయమా? కార్పొరేటర్ల ఆగ్రహం
- జనాభా అసమతుల్యతపై కీలక ప్రశ్నలు సంధించే అవకాశం
- పార్టీలకతీతంగా ఒకే స్వరం – డీలిమిటేషన్‌పై అనుమానాలు
- ఎక్స్‌ఆఫీషియో నేతల ఎంట్రీతో డీలిమిటేషన్ చర్చ వేడెక్కే అవకాశం
- అభ్యంతరాలు విన్న తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్: అధికారుల హామీ
- గ్రేటర్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక సమావేశం నేడు..
గ్రేటర్ హైదరాబాద్‌లో వార్డుల డీలిమిటేషన్ అంశం కేవలం పరిపాలనా ప్రక్రియగా కాకుండా రాజకీయ వివాదంగా మారుతోంది. స్పష్టతలేని బౌండరీస్, అసమాన జనాభా పంపిణీ, మ్యాప్‌ల లేమి వంటి అంశాలు కార్పొరేటర్లలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న జీహెచ్ఎంసి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నగర రాజకీయ దిశను నిర్ణయించే కీలక వేదికగా మారింది. ప్రజాస్వామ్య పరిమితుల్లో అభ్యంతరాలకు స్థానం కల్పిస్తారా? లేక నోటిఫికేషన్ పేరుతో నిర్ణయాలు మోపుతారా? అన్న ప్రశ్నలకు ఈ సమావేశమే సమాధానం చెప్పనుంది.
స్పష్టతలేని విభజన… ప్రజాస్వామ్యానికి ప్రమాదం
డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత కీలకం. అయితే వార్డుల బౌండరీస్‌కు సంబంధించిన స్పష్టమైన మ్యాప్‌లు ఇవ్వకపోవడం, ఏ ప్రమాణాలతో విభజన జరిగిందో వివరించకపోవడం ప్రజాస్వామ్య ప్రక్రియకే విరుద్ధంగా కనిపిస్తోంది. జనాభా అసమతుల్యతలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వాటికి సరైన సమాధానం లేకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది.
అభివృద్ధి కోసమా? రాజకీయ లాభాల కోసమా?
వార్డుల పునర్విభజన వెనుక అభివృద్ధి లక్ష్యమా, లేక రానున్న జీహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ సమీకరణాలా అన్న సందేహం తెరపైకి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అధిక జనాభా, మరికొన్ని చోట్ల తక్కువ జనాభాతో వార్డులు రూపుదిద్దుకోవడం ‘సమాన ప్రతినిధిత్వం’ అనే మౌలిక సూత్రానికే విరుద్ధం.
కౌన్సిల్ వేదికే పరీక్షా స్థలం
నేటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం అధికార యంత్రాంగానికి పరీక్షగా మారింది. కార్పొరేటర్లు, ఎక్స్‌ఆఫీషియో సభ్యులు లేవనెత్తే అభ్యంతరాలకు సమాధానాలు చెప్పకపోతే, ఈ డీలిమిటేషన్ ప్రక్రియపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలకు స్థానం కల్పించకుండా తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక వివాదాలకు దారితీయవచ్చు.
