- ఆదివాసీలను మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపడం దారుణం
- బూటకపు ఎన్కౌంటర్లతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోడీ ప్రభుత్వం
- ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
నర్సంపేట: సహజ సంపదలైన అడవులను ఖనిజాలను కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టడానికే మావోయిస్టులను ఆదివాసి గిరిజనులను విచక్షణారహితంగా కాల్చి చంపుతూ బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు లాంటిదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎం సి పి ఐ యు నర్సంపేట డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన నర్సంపేటలోని ఓంకార్ భవన్ లో జరిగింది.
దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గాదగోని రవి మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తూ నియంతృత్వ విధానాలతో పనిచేస్తున్నదని అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఆపరేషన్ పేరుతో ప్రజాస్వామ్య పద్ధతులకు భిన్నంగా మావోయిస్టు పార్టీ నేతలను కార్యకర్తలను అలాగే ఆదివాసి గిరిజనులను పట్టుకొని ఎన్కౌంటర్ల పేరుతో ప్రాణాలను తీస్తున్నారని ఇది అన్యాయమని ఇలాంటి సంఘటనలను నియంతృత పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోని అత్యంత విలువైన ఖనిజ సంపదను అడవులను ఆదానీ లాంటి పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడానికి పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నారని అందుకు అడ్డుగా ఉన్న ఆదివాసి గిరిజనులను అడవుల నుంచి ఖాళీ చేయించేందుకు మావోయిస్టులనే పేరుతో వేలాదిమంది పోలీసు బలగాలను దించి విచక్షణారహితంగా దాడులు నిర్వహిస్తూ లొంగిపోయిన మావోయిస్టులను ఆదివాసులను సైతం చిత్రహింసలు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆ తర్వాత కాల్చి చంపుతూ ఎన్కౌంటర్ అని బూటకపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో మనిషిని మనిషి చంపే హక్కు లేనప్పటికీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగాన్ని రక్షించి వ్యక్తి స్వేచ్ఛను కాపాడాల్సిన పాలకులే ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని అలాగే బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని లొంగిపోయిన పట్టుబడిన మావోయిస్టులను తక్షణమే వదిలివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, వంగల రాగసుధ, కుసుంబ బాబురావు, నాగేల్లి కొమురయ్య, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు కలకోట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
