సీఎం రేవంత్ రెడ్డిని విన్‌గ్రూప్ (Wingroup) ఏషియా సీఈఓ (Asia CEO) ఫామ్ సాన్ చౌ(Pham Sanh Chau) న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను స్థాపించేందుకు విన్‌గ్రూప్ (Vingroup) ముందుకొచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ యూనిట్లు, బ్యాటరీ నిల్వ సౌకర్యాలను ఏర్పాటుచేయాలన్న విన్‌గ్రూప్ ఉద్దేశాన్ని ఈ సందర్భంగా ఫామ్ సాన్ చౌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సస్టైనబుల్, క్లీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో అవకాశాలనూ పరిశీలిస్తామని చెప్పారు.
ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక ఆసక్తి చూపిన ఫామ్ సాన్ చౌ.. దూరదృష్టి కలిగిన సీఎం రేవంత్ ప్రణాళికలను అభినందించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టేందుకు విన్‌గ్రూప్ సిద్ధంగా ఉందని తెలిపారు. డిసెంబర్ 8–9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో విన్‌గ్రూప్ చైర్మన్ ఫామ్ నాట్ వూంగ్ (Phạm Nhật Vượng)తో కలిసి పాల్గొనాలని ఫామ్ సాన్ చౌ (Pham Sanh Chau)ని సీఎం ఆహ్వానించారు.
ఈ సమావేశం తెలంగాణలో గ్లోబల్ పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవడంలో, భవిష్యత్‌కు దిశనిర్ధేశం చేసే గ్రీన్, ఇన్నోవేషన్ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఒక కీలక ముందడుగుగా నిలిచింది. పరిశ్రమలు & వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కోఆర్డినేషన్(కేంద్ర ప్రాజెక్టులు & CSS) సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
