Tuesday, October 28, 2025
ePaper
Homeకరీంనగర్Open House | పోలీస్ కమిషనరేట్‌లో 'ఓపెన్ హౌస్'

Open House | పోలీస్ కమిషనరేట్‌లో ‘ఓపెన్ హౌస్’

పోలీసుల విధివిధానాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన

గోదావరిఖని: పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా రామగుండం (Ramagundam) పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో విద్యార్థుల కోసం ‘ఓపెన్ హౌస్’ (Open House) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి దాదాపు 1000 మంది విద్యార్థినీ విద్యార్థులు (Students) ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల(Mancherial), పెద్దపల్లి (Peddapalli) డీసీపీలు భాస్కర్, కరుణాకర్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ద్వారా సిబ్బంది షీ టీమ్స్, భరోసా సెంటర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ డివైజ్‌లు, బాంబు డిటెక్షన్ టీమ్ ఎక్విప్‌మెంట్ వంటి పోలీసు వ్యవస్థలోని వివిధ విభాగాలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.

ముఖ్యంగా స్నిఫర్ డాగ్స్ (Sniffer Dogs) ప్రదర్శించిన ప్రతిభ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ… పోలీసులు కేవలం నేరస్థులను పట్టుకోవడానికే కాకుండా సమాజంలో శాంతి భద్రతలు, చట్టపరమైన అవగాహన పెంపు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా వివరించిన ఆయన.. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌(Toll Free Number)కు కాల్ చేయాలని సూచించారు.

బాలికలు, మహిళల రక్షణ కోసం భరోసా కేంద్రం, షీ టీమ్స్ పనితీరును, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహనను పెంపొందించి పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగేలా చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఇతర ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News