తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (Ap Government) హైఅలర్ట్ అయింది. ఎలాంటి ప్రాణ నష్టమూ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు (Precautions) చేపట్టాలని అధికారులను ఆదేశించింది. గర్భిణిలను వెంటనే సురక్ష ప్రాంతాలకు తరలించాలని సూచించింది. అంబులెన్స్(Ambulance)లను సిద్ధంగా ఉంచాలని, పట్టణాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇరిగేషన్ అధికారులు కాలువలు, వాగులకు ఉన్న అడ్డంకులను తొలగించాలని హోం మంత్రి వంగలపూడి అనిత (Anitha) చెప్పారు.

అవసరమైతే పునరావాస కేంద్రాలతోపాటు స్కూల్స్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను వినియోగించుకోవాలని తెలిపారు. సహాయ శిబిరాల రూట్ మాప్స్ చూడాలని, రిలీఫ్ క్యాంపులో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పట్టణాల్లో ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్‌ను వెంటనే తొలగించాలని అన్నారు. పిఆర్ & ఆర్డీ, ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్తు శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
