Sunday, October 26, 2025
ePaper
Homeఅంతర్జాతీయంLouvre Museum | రూ.895 కోట్ల నగలు చోరీ..

Louvre Museum | రూ.895 కోట్ల నగలు చోరీ..

  • పట్టపగలే మ్యూజియంలో ఘరానా దోపిడీ
  • అంతుచిక్కని ప్యారిస్ మ్యూజియం చోరీ
  • హైడ్రాలిక్ నిచ్చెన సాయంతో లోనికి దొంగలు
  • చైన్సాలు, డిస్క్ కట్టర్లను ఉపయోగించి చోరీ
  • పారిపోయిన దొంగలు.. మూసివేసిన మ్యూజియం
  • పింక్ పాంథర్స్ పని అయి ఉండొచ్చనే అనుమానాలు

ఫ్రాన్స్లో ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. అత్యంత భద్రత కలిగిన ఈ మ్యూజియంలోకి చొరబడిన దుండగులు కేవలం నిమిషాల వ్యవధిలో విలువైన ఆభరణాలు దొంగలించి పరారయ్యారు. చోరీ అయిన నగల విలువ దాదాపు రూ.895 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు 19న పారిస్ లోని లౌవ్రే మ్యూజియంలో చోరీ జరిగింది. మ్యూజియంలో ఓ వైపు నిర్మాణం జరుగుతుండగా.. అక్కడి నుంచి దుండగులు లోపలికి చొరబడ్డారు. అనంతరం సరుకు రవాణా ఎలివేటర్లో అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. నెపోలియన్ కాలంనాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని తొమ్మిది వస్తువులను దొంగలించారు. వీరు వెళ్తుండగా.. అందులోని ఓ ఆభరణం మ్యూజియం బయట పడిపోయింది. మిగతా ఆభరణాల విలువ 88 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.895 కోట్లు) ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు దాదాపు 100 మందితో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దొంగతనం చేసింది ఎవరనేది ఇంతవరకూ తేలలేదు.

అయితే కరుడు గట్టిన దొంగల ముఠా పింక్ పాంథర్స్ పని అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చోరీకి పాల్పడింది పింక్ పాంథర్స్ గ్యాంగ్ అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాల్లేనప్పటికీ చోరీ జరిగిన తీరు ఆ ముఠాను గుర్తుకుతెస్తోంది. వీరు గప్చుప్ గా వస్తారు. ఎలాంటి తొట్రుపాటు లేకుండా పని ముగించుకొని వెళ్లిపోతారు. మ్యూజియంలో చోరీకి పాల్పడిన వారు దొంగతనాల్లో ప్రొఫెషనల్గా కన్పించారు. ఇంతవరకూ వారి ఆచూకీ దొరకలేదు. పక్కా సమాచారం, ప్రణాళికతో దొంగతనానికి పాల్పడటం చూస్తుంటే పింక్ పాంథర్స్ పనే అనిపిస్తోంది అని ఫ్రాన్స్ స్క్వాడ్ ౠ’ది స్వీనీ’ మాజీ చీఫ్ బ్యారీ ఫిలిప్స్ అభిప్రాయపడ్డారు. ఈ దొంగల ముఠా గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ చోరీలకు పాల్పడింది. అందరూ చూస్తుండగానే దొంగతనాలు చేయడం వీరి నైజం. కేవలం ఆభరణాలు, వజ్రాలనే దోచుకుంటారు. ఇప్పటివరకు 35 దేశాల్లో దాదాపు 500 మిలియన్ డాలర్ల ఆభరణాలను ఈ గ్యాంగ్ దొంగిలించినట్లు ఆధారాలున్నాయి. వీరి ముఠాలో ఎక్కువ మంది తూర్పు ఐరోపా దేశస్థులే ఉంటారు. కొన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులను రిక్రూట్ చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు.

1990ల్లో జరిగిన బోస్నియాయుద్ధంలో పాల్గొన్న సెర్బియన్ స్పెషల్ ఫోర్సెస్ సభ్యులు కూడా ఈ ముఠాలో ఉన్నట్లు గతంలో ఇంటర్పోల్ గుర్తించింది. మాజీ సైనికులు కావడంతో మిలిటరీ తరహా క్రమశిక్షణతో ప్లానింగ్ చేయడం ఈ గ్యాంగ్ అలవాటు. టార్గెట్ చేసే ప్రాంతంపై ముందుగానే నిఘా ఉంచుతారు. ఆ తర్వాత పథక రచన చేస్తారు. ఒకసారి చోరీ పూర్తయిన తర్వాత వెంటనే నకిలీ పాస్పోర్టులతో దేశం దాటేస్తారు. వీరికి అంతర్జాతీయంగా నెట్వర్క్ ఉంది. దొంగతనం చేసిన ఆభరణాలు, వజ్రాలను కరిగించడం లేదా వాటి ఆకృతి మార్చి మార్కెట్లో విక్రయిస్తుంటారని గత దర్యాప్తుల్లో తేలింది. ఓసారి ఈ పింక్ పాంథర్స్ గ్యాంగ్ దుబాయ్ లోని ఓ మాల్లో చోరీకి పాల్పడింది. మాల్లోని నగల దుకాణంలోకి కార్లతో దూసుకెళ్లి చేతికందినన్ని వజ్రాలు, ఆభరణాలు తీసుకుని కేవలం 45 సెకన్లలో అక్కడి నుంచి పరారయ్యారు. జపాన్, బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద నగల చోరీకి పాల్పడింది ఈ గ్యాంగే. ప్రముఖ హాలీవుడ్ చిత్రం పింక్ పాంథర్లో చూపించిన ఓ ట్రిక్ లాంటిదే చేసి 2003లో లండన్లోని ఓ నగల దుకాణంలో వజ్రాలను చోరీ చేశారు. అప్పటి నుంచి ఈ గ్యాంగ్కు పింక్ పాంథర్ అని పేరొచ్చింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News