- దృష్టి మరల్చేందుకు సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు
- కేంద్రమంత్రి సురేశ్ గోపి సంచలన వ్యాఖ్యలు
కేరళలోని శబరిమల ఆలయంలోని బంగారు విగ్రహాల తాపడం బరువు తగ్గడంఇటీవల వివాదాస్పదమైన నేపథ్యంలో, ఈ ఘటనపై నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. శబరిమల అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పాలక్కడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సురేష్ గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఎదురైన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ ఆరోపణలు చేశారు. శబరిమల బంగారు సమస్య నుంచి దృష్టిని మరల్చేందుకు ఇద్దరు సినీ నటులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, ఆ నటుల పేర్లను ఆయన ప్రస్తావించలేదు. శబరిమల బంగారు కవచాలకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయన్నారు. కేంద్రమంత్రిగా దీనిపై తాను ఇంతకుమించి వ్యాఖ్యానించలేనన్నారు. ఇలాంటి ఘటనలు సాధారణమేనన్నారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే సంఘటనలు జరిగినప్పుడు.. ప్రముఖులే లక్ష్యంగా పోలీసులు చర్యలు తీసుకోవడం మామూలే అన్నారు. ఇలాంటివి మరిన్ని చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ఆ నటుల పేర్లు చెప్పనప్పటికీ.. భూటాన్ నుంచి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న కేసులో ఇటీవల పలువురి నటుల ఇళ్లల్లో కస్టమ్స్ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఆఫీసుతో పాటు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకల్‌కల్ ఇళ్ల పైనా ఈ దాడులు జరిగాయి. దీంతో వీరిని ఉద్దేశించే సురేష్ గోపి తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
