సాయుధ పోరాట విరమణపై, మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, సోనూ, అభయ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ క్యాడర్‌కు లేఖ రాసినట్లుగా మీడియా వర్గాల కథనం. పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని వెల్లడి. ఆయుధాలు వదిలేసే విషయంలో మరోసారి పార్టీ అధికార ప్రతినిధి జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయమని మల్లోజుల పునరుద్ఘాటించారు.
ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయామంటూ క్షమాపణలు కోరారు. వర్తమాన ఫాసిస్టు పరిస్థితులలో మన లక్ష్యాన్ని నెరవేర్చలేము..సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్ కు మల్లోజుల పిలుపునిచ్చారు. పార్టీ క్యాడర్ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలన్నారు. మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు కొనసాగించిన పంథా పూర్తిగా తప్పిదమేనని అభిప్రాయపడ్డారు. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని మల్లోజుల సూచించారు.
మల్లోజుల వేణుగోపాల్ దివంగత మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీకి తమ్ముడు. వేణుగోపాల్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతిచెందాడు. ఆ తర్వాత వేణుగోపాల్ భార్య తారా లొంగిపోయారు. కిషన్ జీ భార్య మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాత కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే పోలీసులకు లొంగిపోయారు.