హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్(Fees reimbursement) బకాయిల విడుదలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంపై రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 6 నుంచి కళాశాలలను తిరిగి తెరుచుకునేలా అనిపించట్లేదు. ఈ విషయంలో తమ కార్యాచరణను ప్రకటించేందుకు బుధవారం సమ్మెకు పిలుపునిచ్చే అవకాశం ఉంది
ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI), ఈ విషయంపై చర్చించడానికి, తదుపరి కార్యాచరణను నిర్ణయించడానికి అత్యవసర కార్యనిర్వాహక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సెప్టెంబర్ 16న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దసరా పండుగలోపు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్(Fees reimbursement) బకాయిలుగా రూ.600 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, దీని వల్ల రాష్ట్రంలోని అనేక విద్యా సంస్థలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నాయి అని FATHI తెలిపింది. గత నాలుగు సంవత్సరాలుగా నిధులు విడుదల కాకపోవడంతో సంస్థలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నాయని, ప్రస్తుతం బకాయిలు దాదాపు రూ.10,000 కోట్లకు చేరాయని FATHI పేర్కొంది.
గతంలో, సెప్టెంబర్ 15 నుంచి విద్యా సంస్థలను మూసివేయాలని FATHI ప్రకటించింది. అయితే, ప్రభుత్వం వరుస సమావేశాలు నిర్వహించి, దసరా పండుగకు ముందే రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో, ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోకపోవడంతో, విద్యాసంస్థలు మళ్లీ ‘బంద్’ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాయి.
మరిన్ని వార్తలు :