Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeసినిమాచిత్ర పరిశ్రమలో ఎవరి స్వార్థం వారిదే

చిత్ర పరిశ్రమలో ఎవరి స్వార్థం వారిదే

కిష్కింధపురి హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌

ఇండస్ట్రీలో మన అనుకునే వాళ్లు ఉండరని ఎవరి స్వార్థం వారిదని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అన్నారు. శ్రీనివాస్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ’కిష్కింధపురి’ ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తనకు ఇండస్ట్రీలో స్నేహితులు లేరని తెలిపారు. నేను ఓపెన్‌గా ఉంటాను. మనసులో ఏదో పెట్టుకొని ఇలా మాట్లాడితే, ఆటిట్యూడ్‌ చూపిస్తే అభిమానులు పెరుగుతారేమోనని ఎప్పుడూ లెక్కలు వేసుకొని మాట్లాడలేదు. భైరవం కంటే ముందు చాలా తక్కువగా మాట్లాడేవాడిని. ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నాను.

ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఒకేలా ఉన్నాను. మనసులో ఏదైనా ఉంటే నిద్రరాదు.. ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. అందుకే ఓపెన్‌గా ఉంటా. నేను ఎవరి విషయంలోనైనా బాధపడితే వాళ్లకు మొహం మీదే చెప్పేస్తానని ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరి స్వార్థం వాళ్లకు ఉంటుంది. మన అనే వాళ్లు ఎవరూ ఉండరు. ఇదొక సముద్రం లాంటిది. లోతు ఎంత అనేది దీనిలో దిగిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇండస్ట్రీలో కూడా ఫ్రెండ్స్‌ ఉండి ఉండొచ్చు.. కానీ, బయట ఉన్నంత స్వచ్ఛంగా ఇక్కడ ఉండరు. మనతో బాగుంటారు.. మనం పక్కకి వెళ్లగానే మన గురించి మరోలా మాట్లాడతారు. నేనెప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడను. చిన్నప్పటి నుంచి అంతే. గాసిప్స్‌ కూడా విననని అన్నారు.

ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదనేది చాలా మంది చెబుతున్న మాట. కానీ, మంచి సినిమా అయితే ఖ‌చ్చితంగా వస్తారని నేనెప్పుడూ నమ్ముతా. ఓ మంచి కథతోనే మా ’కిష్కింధపురి’ తెరకెక్కింది. ఆద్యంతం ఈ చిత్రం థ్రిల్‌ని పంచుతుంది. దర్శకుడు కౌశిక్‌ పెగల్లపాటి అద్భుతమైన కథని రాసుకుని తెరపైకి తీసుకొచ్చారు. థియేటర్లో ఫోన్‌ చూసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఈ సినిమా థ్రిల్‌ని పంచుతుంది. సంగీతం, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఈ సినిమాకి చాలా ముఖ్యం అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌.

RELATED ARTICLES
- Advertisment -

Latest News