అంబేద్కర్ వర్సిటీలో ‘కోర్సు అభివృద్ధి’పై 3 రోజుల సదస్సు ప్రారంభం
అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటీ(Ambedkar Open University)లోని సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ & కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా(COL-CEMCA) సహకారంతో ఉద్యోగ అవకాశాల కల్పన-మార్గదర్శకాలతో కోర్సుల అభివృద్ధి అనే అంశంపై 3 రోజుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి (18వ తేదీ) వరకు నిర్వహించనున్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి మాట్లాడుతూ.. వర్క్‌షాప్ (Workshop) గ్రాడ్యుయేట్ ఎంప్లాయబిలిటీ ప్రాజెక్ట్(Graduate Employability Project)లో భాగంగా విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసిన ఎంప్లాయబిలిటీ ఫ్రేమ్‌వర్క్(Framework)లో ఒక భాగమని అన్నారు. ఎంప్లాయబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసి, దాని అమలు దిశగా ముందుకు సాగుతున్న విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొదటిది కావడం గర్వకారణమని చెప్పారు. ఈ సెమ్కా ప్రాజెక్ట్‌కు కృష్ణ విశ్వవిద్యాలయం (Krishna University) మాజీ వైస్ వీసీ ప్రొఫెసర్ వి.వెంకయ్య మార్గదర్శనం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలు అందించే పాఠ్యాంశాల్లో ఉపాధి నైపుణ్యాలను ఈ వర్క్‌షాప్ అనుసంధానిస్తుందన్నారు. ఉపాధి కల్పించేలా కోర్సుల రూపకల్పనే ఈ సదస్సు లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఈ.ఎం.ఎం.ఆర్.సి. డైరెక్టర్ ప్రొఫెసర్ డి.రవీంద్రనాథ్ సోలమన్, పలు విభాగాల డైరెక్టర్లు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
