తెలంగాణ ఆడపడుచులకు మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు
ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అఘాటంగా ముందుకు సాగుతోందని రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమేనని ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సున్నా వడ్డీ రుణాలు అందించడంతో పాటు మహిళలను ఆర్టీసీ బస్సుల యజమానులుగా, పెట్రోల్ బంకుల యజమానులుగా, సోలార్ పవర్ యజమానులుగా, ఇందిరా క్యాంటీన్‌ల యజమానులుగా తీర్చిదిద్దే పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకంతో మహిళలు ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పండుగను జరుపుకుంటూ తమ స్వగ్రామాలకు వెళ్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 225 కోట్ల సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దాదాపు ₹7,430 కోట్ల విలువైన ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఆర్టీసీకి భారం చెల్లించిందని తెలిపారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న 2017 వేతన సవరణను పూర్తి చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని, అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. పండగ సమయంలో కుటుంబాన్ని వదిలి విధుల్లో నిమగ్నమైన ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు.





త్వరలోనే హైదరాబాద్ నగరంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇవి కాలుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500కి గ్యాస్ వంటి పథకాలు మహిళలకే కేంద్రబిందువుగా అమలు అవుతున్నాయని మంత్రి వివరించారు.