Wednesday, October 1, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్Almatti dam : ఆల్మట్టి పై ఎందుకు మౌనం...తెదేపాని ప్రశ్నించిన వైకాపా

Almatti dam : ఆల్మట్టి పై ఎందుకు మౌనం…తెదేపాని ప్రశ్నించిన వైకాపా

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రయోజనాలను విస్మరిస్తూ, అసెంబ్లీ సమావేశాలను కేవలం దృష్టి మళ్లించే రాజకీయాలు, వ్యక్తిగత దూషణల కోసం వాడుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం తీవ్ర స్థాయిలో విమర్శించింది. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి. సతీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆలమట్టి డ్యామ్(Almatti dam) ఎత్తు పెంచాలనే కర్ణాటక ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనం వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. డ్యామ్ ఎత్తు పెంచడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా నది నీటి వాటాలో 100 టీఎంసీలను కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

“ఆలమట్టి ఎత్తు పెరిగితే రాయలసీమలో కరువు మరింత పెరుగుతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీటి ప్రవాహం ఆగిపోతుంది. సాగు, తాగునీటి సరఫరా పూర్తిగా స్తంభిస్తుంది” అని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు వెంటనే దీనిని అడ్డుకోవాలని, లేదంటే ఆయన వైఫల్యం రాష్ట్రానికి ఒక పెద్ద శాపంగా మారుతుందని మండిపడ్డారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర వ్యతిరేకత తప్పదని ఆయన హెచ్చరించారు. ఆలమట్టి(Almatti dam) సమస్య రాష్ట్ర మనుగడకు సంబంధించినదని, ప్రభుత్వం విఫలమైతే ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడడానికి వైఎస్సార్‌సీపీ కేంద్ర స్థాయిలో పోరాడుతుందని ప్రకటించారు.

అసెంబ్లీ సమావేశాలు రాష్ట్రంలోని వాస్తవ సమస్యలను చర్చించడానికి బదులుగా, కేవలం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై దూషణలు చెయ్యడానికి మాత్రమే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధర లేక పంటలను రోడ్ల పాలు చేస్తున్నారని, కొత్తగా పెన్షన్లు మంజూరు చేయలేదని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని సతీష్ రెడ్డి ఆరోపించారు.

మరిన్ని వార్తలు :

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

RELATED ARTICLES
- Advertisment -

Latest News