Tuesday, October 28, 2025
ePaper
Homeసాహిత్యంwater | సురక్షిత తాగు నీటితోనే ప్రజారోగ్యం

water | సురక్షిత తాగు నీటితోనే ప్రజారోగ్యం

18 సెప్టెంబర్‌ “ప్రపంచ నీటి పర్యవేక్షణ దినం” సందర్భంగా..

జీవులకు ప్రాణాధారం నీరు మాత్రమే. నీరు ఒక సార్వత్రిక ద్రావణి. జలం లేకుండా జీలడవనం సాగదు. ప్రకృతి ప్రసాదించిన సహజ అమూల్య వనరులుగా నీటి నిల్వలు కలిపిస్తాయి. నదులు, సరస్సులు, చెరువులు, వాగులు, సముద్రాలు, భూగర్భజలాలు లాంటి పలు నీటి వనరులు సకల ప్రాణికోటికి అందుబాటులో ఉన్నాయి. రసాయనశాస్త్ర పరంగా నీటిని త్రిపరమాణుక విజాతీయ అణువుగా నామకరణం చేశారు. రెండు హైడ్రోజన్‌ పరమాణువులు, ఒక ఆక్సీజన్‌ పరమాణువు కలిసి H2O అను రసాయన ఫార్ములాతో సూచించడం జరుగుతోంది. సురక్షిత మంచి నీరు అందించినపుడు మాత్రమే పలు వ్యాధులకు అడ్డుకట్టపడుతుంది. కలుషిత నీరు తాగితే కలరా, డయేరియా, టైఫాయిడ్, డిసెంట్రీ, హెపటైటిస్, ‌మలేరియాసిస్‌‌ లాంటి తీవ్రమైన వ్యాధులు సోకుతాయి. మానవాళి ఎదుర్కొంటున్న 80 శాతం రోగాలకు కలుషిత తాగు నీరే కారణమని తెలుస్తున్నది. ప్రపంచ మరణాల్లో 5 శాతం వరకు కలుషిత నీటి వల్ల కలుగుతున్నట్లు నిర్థారించారు. భారత్‌లో 70 మిలియన్ల మరణాలు డయేరియా కారణంగా నమోదు అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, విశ్వవ్యాప్తంగా ప్రతి ముగ్గురు జనాభాలో ఒక్కరు సురక్షిత నీటికి దూరంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్రపంచ నీటి పర్యవేక్షణ దినం-2025:
భూమండల ఉపరితలంపై 71 శాతం నీరు ఆక్రమించి ఉంది. ప్రపంచంలోనే నీటిలో 3 శాతం మాత్రమే సురక్షిత మంచి నీరుగా అందుబాటులో ఉన్నది. మిగిలిన 97 శాతం నీరు సముద్రాలు, మంచు కొండల రూపంలోనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ప్రజలకు స్వచ్ఛమైన సురక్షిత నీరు అందడం లేదు. పరిసరాల పరిశుభ్రతకు కూడా నీటి అవసరం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా తాగు, సాదు నీటి కొరతలను తట్టుకోవడానికి, అందుబాటులో ఉన్న నీటిని కలుషితం కాకుండా చూసుకోవడానికి, తరుచుగా నీటి నాణ్యతలను తెలుసుకోవడానికి సంబంధించిన అవగాహన కల్పించడానికి 2003 నుంచి అమెరికాకు చెందిన మంచి నీటి సంస్థ చొరవతో ప్రతి ఏట 18 సెప్చెంబర్‌ రోజున “ప్రపంచ నీటి పర్యవేక్షణ దినం (వరల్డ్‌ వాటర్‌ మానిటరింగ్‌ డే)” పాటించడం ఆనవాయితీగా మారింది. మనకు స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను తరుచుగా పరీక్షించుకోవడం, నీటి నాణ్యత పట్ల అవగాహన కలిగి ఉండడం, నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి అవుతున్నది. నీటి నాణ్యతను విచ్ఛిన్నం చేయడానికి పురుగు మందులు, రసాయన ఎరువులు, మురుగు నీరు, రసాయన వ్యర్థాలు, పరిశ్రమల వ్యర్థాలు, మానవ ప్రమేయం వ్యర్థాలతో నీరు కలుషితం కావడం, చమురు లీక్ కావడం లాంటివి దోహదపడుతున్నాయి. వీటికి తోడుగా ఉష్ణోగ్రత, ఆమ్లత్వం, కరిగి ఉన్న ఆక్సీజన్‌, క్లారిటీ లాంటివి కూడా పనిచేస్తాయి. నీటిని శుద్ధి చేయడానికి వడపోత, స్వేదనం, మరిగించడం, క్లోరినేషన్‌ లాంటివి దోహదపడతాయి.

సురక్షిత తాగు, సాగు నీటి కోసం యుద్ధాలు వద్దు:
నేడు అభివృద్ధి చెందుతున్న అల్పాదాయ ప్రపంచదేశాల్లో ఇథియోపియా, ఉగాండా, సోమాలియా, నైజీరియా, పాకిస్థాన్‌, మొజాంబిక్‌ లాంటి దేశాల్లో అధిక జనాభాకు సురక్షిత తాగు నీరు అందడం లేదు. నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తరుచుగా నీటి నాణ్యతను పరీక్షించుకోవడం, సురక్షిత తాగు నీటి అవసరాలను అవగాహన పరచడం, సభలు/ సమావేశాలు నిర్వహించి నీటి పర్యవేక్షణ ప్రాధాన్యాన్ని వివరించడంతో లాంటి కార్యక్రమాలను తేపట్టాలి. నీటి రవాణాలో లీకేజీలను అడ్డుకోవడం, నల్లా నీరు వృధా కాకుండా చూసుకోవడం, సూక్ష్మ సేద్యం చేయడం, స్ప్రింక్లర్లను వాడడం, నీటి పొదుపు పట్ల విద్యార్థులకు అవగాహన కలిపించడం లాంటివి వివరించాలి.‌ గ్రామీణ భారతంలో 83 శాతం, పట్టణ జనాభాలో 91 శాతం జనాభాకు సురక్షిత నీరు లభిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జలంతో జనానికి విడదీయరాని బంధం ఉన్నది. పేదరికం, అధిక జనాభా, నిరక్షరాస్యత వంటి కారణాలు కూడా సురక్షిత నీటి లభ్యతకు ప్రతిబంధకాలుగా పని చేస్తున్నాయి. విద్య, వైద్యం, సురక్షిత తాగు నీరు లభించడం ఒక ప్రాథమిక హక్కు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద అధికంగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ల ప్రజలు అంతర్జాతీయ నీటి వనరులపైన మాత్రమే ఆధారపడుతున్నట్లు, అందులో కేవలం 24 దేశాలు మాత్రమే ఒక అంతర్జాతీయ ఒప్పందాలను చేసుకున్నాయని తెలుస్తున్నది. తాగు, సాగు నీటి లభ్యతపై ప్రపంచ శాంతి ఆధారపడి ఉన్నది. నీటి కోసం వివిధ పౌర సమూహాలు, దేశాలు ఘర్షణ పడుతున్నాయి.

సహజ నీటి వనరులను సక్రమంగా వాడుకోని యెడల కలుషిత జలాలు ఏరులైపారి రోగాలను వ్యాపింపజేస్తాయి. నేటి పౌర సమాజం నీటిని పొదుపుగా వాడుకుంటూ, కలుషితం కాకుండా చూసుకుంటూ, నీటి వనరులను పర్యవేక్షించుకుంటూ ఆయురారోగ్యాలతో మనుగడ సాగిద్దాం, నీటి ఆధార అనారోగ్యాలకు అడ్డుకట్ట వేద్దాం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News