వాస్తవానికి మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరవాత పుట్టిన చాలా జంతు జాతులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతు జాతులు కనుమరుగై పోతున్నాయి. ఇలా జంతువుల జాతులు అంతరించి పోకుండా, వాటిని పరిరక్షించడమే ‘ప్రపంచ జంతు దినోత్సవం’ ముఖ్యోద్దేశం. ఏటా అక్టోబర్ 4న ఈ జంతు దినోత్సవాన్ని అంతర్జా తీయంగా నిర్వహిస్తున్నారు. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడం, వృద్ధి చేయడం, జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థక మవుతున్న నేపథ్యంలో.. వాటి సంరక్షణ ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ప్రతీ ఏటా అన్ని దేశాలు దీన్ని ప్రపంచ జంతు దినోత్సవాన్ని జరుపు తున్నాయి. ప్రపంచ జంతు దినోత్సవాన్ని సైనాలజిస్ట్ హెన్రిచ్ జిమ్మెర్మాన్ ప్రారంభించాడు. ఆయన మొదటి ప్రపంచ జంతు దినోత్సవాన్ని 24 మార్చి 1925 న జర్మనీలోని బెర్లిన్‌లోని స్పోర్ట్ ప్యాలెస్‌లో నిర్వహించాడు. దీనికి 5,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. అనంతరం ఇది 1929లో అక్టోబరు 4కు మార్చ బడింది. ప్రారంభంలో అతను జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మరియు చెకోస్లోవేకియాలో మాత్రమే పాటించారు. చివరగా, మే 1931 లో ఫ్లోరెన్స్ ఇటలీలో జరిగిన ఇంటర్నేషనల్ యానిమల్ ప్రొటెక్షన్ కాంగ్రెస్ సమావేశంలో, అక్టోబర్ 4 ప్రపంచ జంతు దినోత్సవాన్ని సార్వత్రికం చేయాలన్న ఆయన ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించి తీర్మానంగా ఆమోదించారు. హీన్రిచ్ జిమ్మెర్మాన్ చేసిన కార్యక్రమాల, ప్రచారం కారణంగా 1931, మే నెలలో ఇటలీలోని ఫ్లోరెన్స్లో జరిగిన అంతర్జాతీయ జంతు రక్షణ సదస్సులో అక్టోబరు 4ను అంతర్జాతీయ జంతు దినోత్సవంగా ఏకగ్రీవంగా అమోదించడం జరిగింది. ప్రపంచ జంతు దినోత్సవం 2003 నుండి యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ నేచర్ వాచ్ ఫౌండేషన్ నేతృత్వంలోని మరియు స్పాన్సర్ చేసిన జంతు సంరక్షణ ఉద్యమాన్ని ఏకం చేసే ప్రపంచ కార్యక్రమంగా పెరుగుతోంది. జాతీయత, మతం, విశ్వాసం లేదా రాజకీయ భావజాలంతో సంబంధం లేకుండా అనేక దేశాలలో విస్తృతంగా అంగీకరించ బడింది మరియు వివిధ రకాలుగా జరుపు కుంటారు. దినోత్సవం రోజున జంతు సంక్షేమ ప్రచారంతో పాటుగా జంతు పరిరక్షక శిబిరాలను ప్రారంభించడం, జంతు సంరక్షణకు నిధులు సేకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వన్య ప్రాణుల సంరక్షణ కోసం మన ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. అయితే స్మగ్లర్లు, వేటగాళ్లు.. వన్యప్రాణులు, అరణ్యాల పాలిట శాపంలా తయారయ్యారు. వీళ్ల దెబ్బకు కీకరారణ్యాలు సైతం మైదానాలుగా మారుతున్న పరిస్థితి. పరిశ్రమల స్థాపన పేరిట పెద్ద ఎత్తున అటవీ భూముల్లో పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటం కూడా వన్యప్రాణుల మనుగడుకు ముప్పుగా మారింది. దీంతో గూడు చెదిరిన వన్యప్రాణుల జనారణ్యం లోకి వస్తున్న పరిస్థితి. దేశంలోని జంతు సంపదను పరిరక్షించడానికి మొట్టమొదటి సారిగా 1898లో ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం మొదటి పక్షుల అభయారణ్యాన్ని తమిళనాడు లోని వేదాంతంగల్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1935లో మొదటి వన్య ప్రాణి జాతీయ పార్కు ‘హేలీ’ని ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. ఇదే పార్కును ఇప్పుడు జిమ్ కార్బెట్ పార్కు అని పిలుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం జాతీయ పార్కుల సంఖ్య 102.
1976లో జరిగిన రాజ్యాంగ సవరణలోని ఆర్టికల్ 51(ఎ) ప్రకారం వన్యప్రాణి సంరక్షణ పౌరుల ప్రాథమిక విధి. ఆదేశిక సూత్రాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు విధిగా వన్యప్రాణులను సంరక్షించాలని పేర్కొన్నారు. జాతీయ వన్యప్రాణి చట్టం 1972, వన్యప్రాణులను వేటాడటాన్ని పూర్తిగా నిషేధించింది.
ఆనాటి ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం వన్య ప్రాణుల వేట నిషేధం. ఈ చట్టం అమలులోకి వచ్చాక.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 23 టైగర్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 441వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉండగా.. వీటిల్లో 28 టైగర్ జోన్స్ ఉన్నాయి.
అంతర్జాతీయంగా పులి చర్మానికి, గోళ్లకు, ఎముకలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో.. వేటగాళ్ల చేతిలో చిరుతల బలైపోతున్నాయి. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశవ్యాప్తంగా ఉన్న అడవుల్లో దాదాపు నలభై వేలకు పైగా ఉన్న పులులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ 1972 నాటికే ఆ సంఖ్య మూడు వేలకు పడిపోయిందంటే.. అప్పటి ప్రభుత్వాలు ఎంతటి నిర్లక్ష్య వైఖరి అవలంభించాయో స్పష్టంగా అర్థమవుతోంది. సాధారణంగా పులుల జనాభాను లెక్కించేందుకు ఇంతకు ముందు పాదముద్రలను గుర్తించడం ఒక్కటే మార్గం. అవి సంచరించే ప్రాంతాల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి.. వాటి పాదముద్రలను సేకరించేవారు. అయితే ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. కచ్చితమైన లెక్కకు ఆస్కారం కూడా తక్కువే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పులుల మలం ద్వారా వాటిని లెక్కించే పద్దతిని ఆవిష్కరించింది. 20వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష పైచిలుకు పులులు ఉండేవి అని అంచనా. 2014 లెక్కల ప్రకారం ప్రపంచంలో 3891 పులులు ఉండగా వాటిలో 2226 మన దేశంలోనే ఉన్నాయి. భారత్‌లో 2011 లెక్కల ప్రకారం 1706, 2014 ప్రకారం 2226 ఉండగా 2018 పులుల గణన ప్రకారం మన దేశంలో 2967 పులులున్నాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల్లో 70శాతం పైగా మనదేశం లోనే ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లలో ఒక్క మధ్య ప్రదేశ్‌లోనే 19 పులులు మృత్యువాత పడ్డాయి. మహారాష్ట్రలో 9, ఉత్తరాఖండ్‌లో 9 మృత్యువాత పడ్డాయి. 2016లో దేశవ్యాప్తంగా74 పులులు మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2006లో పులులను స్మగ్లర్ల బారి నుండి కాపాడటానికి టైగర్ టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు.
భారత దేశంలో పశ్చిమ కనుమలు, నల్లమల కొండలు, శేషాచలం కొండలు, హిమాలయాలు, దేశ ఈశాన్యప్రాంతం విభిన్న జంతు జీవ జాలానికి నిలయంగా ఉన్నాయి. మానవుడికి, జంతువులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ దినోత్సవం తెలియ జేస్తుంది. ఈ రోజున జంతు సంక్షేమ ప్రచారాలతో పాటు జంతు పరిరక్షక శిబిరాలను ప్రారంభించడం, జంతు సంరక్షణకు నిధులు సేకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశంలో అడవులు అన్యాక్రాంత మవుతున్నాయి. ఒకప్పుడు విశాలంగా ఎక్కడ చూసినా పచ్చదనంతో బాసిల్లే అటవీ ప్రాంతాలు రాను రాను కనుమరుగై పోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ అటవీ ప్రాణుల వేట యధేచ్చగా జరుగుతుంది. వాస్తవానికి మనం జంతువుల ఆవాసాలను నాశనం చేస్తున్నాం. విచక్షణా రహితంగా అడవులు నరుకుతూ వాటి తావులను, మంచినీటి వనరులను ధ్వంసం చేస్తున్నాం. అందుకే అడవి జంతువులు గ్రామాల్లొకీ, పట్టణాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని మార్చడం కూడా ఈ జంతు దినోత్సవం లక్ష్యాల్లో ఒకటి. జంతువులకు సహజ సిద్ధమైన ఆవాసాలను కల్పించడం, జంతు జాతులను రక్షించడం, వాటి సంక్షేమాన్ని కాపాడటం ఇవే ప్రధానం. ఈరోజును జంతు ప్రేమికుల దినోత్సవంగా కూడా పిలుస్తారు.
By – రామ కిష్టయ్య సంగన భట్ల