Saturday, October 4, 2025
ePaper
Homeస్పోర్ట్స్ఆటగాళ్లను రిటైర్డ్‌ ఔట్‌గా పంపడమేంటి?

ఆటగాళ్లను రిటైర్డ్‌ ఔట్‌గా పంపడమేంటి?

టీమిండియా మాజీ క్రికెటర్‌ కైఫ్‌ అసహనం

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఆటగాళ్లను రిటైర్డ్‌ ఔట్‌గా బయటకు పంపించాడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ తప్పు బట్టాడు. ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఇప్పటికే ఇద్దరు బ్యాటర్లు రిటైర్డ్‌ ఔట్‌గా బయటకు వచ్చారు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌.. తమ బ్యాటర్‌ తిలక్‌ వర్మను రిటైర్డ్‌ ఔట్‌గా బయటకు రప్పించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 23 బంతుల్లో 25 పరుగులే చేసి తీవ్ర తడబడిన తిలక్‌ వర్మను.. ముంబై ఇండియన్స్‌ రిటైర్డ్‌ ఔట్‌గా బయటకు రప్పించింది. ఇది సరికాదని తీవ్ర విమర్శలు రాగా.. తలకు బంతి తగలడంతోనే అతన్ని బయటకు పంపించామని హార్దిక్‌ పాండ్యా వివరణ ఇచ్చాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ బ్యాటర్‌ అయిన డెవాన్‌ కాన్వే (69 నాటౌట్‌)ను బయటకు రప్పించింది. ఈ రెండు సందర్భాల్లో ఆ జట్లకు ఓటమే ఎదురైంది. తాజాగా ఈ వ్యవహారంపై ఎక్స్‌ వేదికగా స్పందించిన మహమ్మద్‌ కైఫ్‌.. అసహనంతో ఆయా జట్లు రిటైర్డ్‌ ఔట్‌ నిర్ణయాన్ని తీసుకుంటున్నాయని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో రాహుల్‌ తెవాటియా బ్యాటింగ్‌కు ఇలానే ఫ్రస్టేట్‌ అయి రిటైర్డ్‌ ఔట్‌గా బయటకు పంపిస్తే అతను 5 బంతుల్లో 5 సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ గెలిపించేవాడా? అని కైఫ్‌ ప్రశ్నించాడు.‘అసహనంతో జట్లు రిటైర్డ్‌ ఆప్షన్‌ ఉపయోగించుకుంటున్నాయి. ఈ చిట్కా చాలా తక్కువ సందర్భాల్లో ఫలితం ఇస్తోంది. అతి తక్కువ మంది బ్యాటర్లు మాత్రమే తొలి బంతిని సిక్సర్‌గా తరలిస్తారు. చాలా సందర్భాల్లో క్రీజులో పోరాడుతున్న బ్యాటర్లే విజయాలను అందించారు. రాహుల్‌ తెవాటియా బ్యాటింగ్‌ గుర్తుందా? అతను ఆఖరి 5 బంతుల్లో 5 సిక్స్‌లు బాది తన జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో తొలి 19 బంతుల్లో అతను 8 పరుగులు మాత్రమే చేశాడు.’అని కైఫ్‌ పేర్కొన్నాడు.ఐపీఎల్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు బ్యాటర్లు రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగారు. ఈ రూల్‌ను ఉపయోగించుకున్న తొలి బ్యాటర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగిన అతను రిటైర్డ్‌ ఔట్‌గా మైదానం వీడాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో అథర్వ టైడ్‌, సాయి సుదర్శన్‌ ఈ రూల్‌ను ఉపయోగించారు. తాజా సీజన్‌లో తిలక్‌ వర్మ, డెవాన్‌ కాన్వే రిటైర్డ్‌ ఔటయ్యారు. ఈ ఐదు సందర్భాల్లో ఈ రూల్‌ను ఉపయోగించిన జట్లకు రెండు సార్లు మాత్రమే విజయం దక్కింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News