Friday, October 3, 2025
ePaper
HomeఫోటోలుFemale Employees | త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం...

Female Employees | త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం…

  • మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
  • ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి
  • సవాళ్లు ఉన్నా.. విధి నిర్వహణలో సమర్థంగా రాణింపు
  • మహిళా ఉద్యోగుల సమస్యలపై 22న రౌండ్‌ టేబుల్‌ సమావేశం
  • సచివాలయ ఉద్యోగుల సమావేశంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ

సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదని రాష్ట్ర మంత్రులు . సీతక్క, కొండా సురేఖ లు అన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజలకు అందించే దిశలో పని చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. మంగళవారం డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ సెక్రటేరియట్‌ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సర్వ సభ్య సమావేశంలో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభ్యులుగా ఎన్నికైన మహిళ ఉద్యోగులచే ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, మహిళలకు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ విధి నిర్వహణలో అద్భతంగా ప్రభుత్వ ఉద్యోగంలో రాణిస్తున్నారని, మహిళకు ఉద్యోగం అంటేనే అదనపు బాధ్యత, ఒకవైపు కుటుంబ బాధ్యతలు మరొకవైపు వృత్తి బాధ్యతలు.. రెండిటిని ఏకకాలంలో నెరవేర్చుతున్న మహిళా ఉద్యోగులను ప్రశంశించారు. కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడిలకు గురువుతున్నారని, వారి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కూడా చూసుకోవాలన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించేందుకు మహిళ ఉద్యోగులందరితో ఈనెల 22న రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు ఇచ్చే సూచనలు, సలహాల మేరకు ఒక నూతన మహిళా పాలసీని తేవడానికి పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు 67 లక్షల మంది మహిళలతో పని చేస్తున్నాయని వివిధ రంగాలలో మహిళా స్వయం సహాయక బృందాలు అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇటీవలనే మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పెట్రోల్‌ బంకుల నిర్వహణ ద్వారా కేవలం ఒక నెలలో 13 లక్షల రూపాయలు అర్జించారని అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, పథకాలు విజయవంతం కావడానికి ప్రభుత్వ ఉద్యోగుల కృషి కీలకమని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ సెక్రటేరియట్‌ ఉమెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ లోగో ను ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు రమాదేవి, సంఘం సభ్యులు శైలజ, మంగ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News