హిందూ కాలపట్టిక ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందూ పౌర సమాజం దసరా – విజయదశమి వేడుకలను అత్యంత ఉత్సాహభరితంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుపోవడం జరుగుతున్నది. శ్రీరాముడు రాక్షస రావణుడిని సంహరించిన పవిత్ర రోజుగా మాత్రమే కాకుండా దుర్గాదేవి మహిషాసురుడిని వరించిన రోజుగా కూడా పర్వదినం జరుపుకోవడం కొనసాగుతున్నది. మహిషాసురుడనే రాక్షసుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసిన దుర్గాదేవి పదవ రోజుల ఆ రాక్షసుడిని సంహరించడం జరిగిందనే విషయం మనకు తెలుసు. పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ ఆయుధాలను జమ్మ్చెట్టుపై నుంచి తీసి పూజలు చేసిన అనంతరం కౌరవులను ఓడించారని కూడా మనం శమీ పూజలు నిర్వహిస్తాం, జమ్మి ఆకును బంగారంగా భావించి మన ఆత్మీయులతో పంచుకుంటూ, అందరం క్షేమంగా, సురక్షితంగా ఉండాలని ప్రార్థనలు చేస్తాం. చేడుపై మంచి, అన్యాయంపై న్యాయం, అధర్మంపై ధర్మం విజయంగా విజయదశమి పర్వదినం నిలుస్తున్నది. మనం కూడా మన జీవిత లక్ష్యాలను సుసాధ్యం చేసుకోవడానికి మనలో ఉన్న బలహీనతలు లేదా చెడు అలవాట్లను త్యాగం చేసుకుంటూ బలాలను పటిష్ట పరుచుకుంటూ ముందుకు సాగడానికి ఈ పర్వదినం ప్రేరణగా నిలుస్తున్నది. ఆయుధ పూజను చేసే ఆచారం మనలో జీవన సాఫల్య నైపుణ్యాలను పెంపొందించుకోవడాన్ని సూచిస్తున్నది.
విజయదశమి పర్వదిన వేడుకలు :
ఆంధ్రప్రదేశ్‌లో శరన్నవరాత్రి, తెలంగాణలో బతుకమ్మ పండుగలను శక్తి స్వరూపిణి ప్రతిరూపాలుగా పూజలుగా నిర్వహించుకుంటున్నాం. దుర్గాష్టమి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. మరునాడు వచ్చే మహర్నవమి అనంతరం వైభవంగా విజయదశమి వేడుకలు నిర్వహిస్తారు. శమీ పూజ, అపరాజిత పూజలను ఈ పవిత్ర దినాన నిర్వహిస్తారు. చెడుపై మంచి విజయంగా పదితలల రావణుడిని శ్రీరాముడు సంహరించిన రోజుగా రావణుడి దిష్టి బొమ్మను ‘రావణ వధ’ లేదా ‘రావణ దహనం’ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతోంది. ఆ విధంగా తొమ్మిది రోజుల (నవరాత్రుల) పూజ అనంతరం పదవ రోజు విజయదశమి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా దుర్గ, సరస్వతి, లక్ష్మి, గణేశ్ విగ్రహాలను సమీప నదుల్లో లేదా జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు. పూజించాల్సిన వాహనాలు, ఆయుధాలు, పని మెట్లను శుభ్ర పరుచుకోవడం, ఆయుధాలను ఎరుపు వస్త్రాల్లో ఉంచడం, పవిత్ర గంగా జలాలను చల్లి శుద్ధి చేయడం, పసుపు-కుంకుమ-గంధం పూల మాలలు సమర్పించడం, దీపం వెలిగించి ధూపం వేయడం, జమ్మి ఆకులతో పూజ చేయడం, అక్షింతలు-స్వీట్స్ సమర్పించడం లాంటి పవిత్ర ఆచారాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుపోవడం ఆనవాయితీగా వస్తున్నది.
మనలోని రాక్షస ఆలోచనలకు నిప్పు పెట్టి, సదాలోచనలకు పూజలు చేసి ఆహ్వానించి మన జీవితాల్లో కూడా మనం విజయ తీరాలు చేరాలని విజయదశమి వేడుకలు బోధిస్తున్నాయి. చదువుతో పాటు సంస్కారం, అవసర నైపుణ్యాలను కూడగట్టుకొని, ఆ నైపుణ్యాలను పదునైన ఆయుధాలుగా మలుచుకొని మన లక్ష్యాలను ఛేదించే ప్రయత్నాలను మనస్ఫూర్తిగా చేద్దాం. సామరస్యం, శక్తి రూపం, ఐక్యత, చెడు త్యాగం, మంచిని ఆహ్వానించడం లాంటి లక్షణాలే చిహ్నాలుగా విజయదశమి – దసరా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. మనలోని చెడు ఆలోచనలపై మంచి భావనలు విజయం సాధించాలని కోరుకుందాం. విజయదశమి శుభవేళ ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుందని బలంగా నమ్ముతాం. సరికొత్త ఆలోచనలకు ఈ విజయదశమి శుభారంభం కావాలని ఆ దుర్గామాతను, శ్రీరామచంద్రుడు స్వామిని మనసారా కోరుకుందాం.
BY – డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి