Wednesday, February 25, 2026
Homeసాహిత్యంJwalamukhi | చైతన్యానికి ప్రేరణలు.. జ్వాలాముఖి రచనలు..

Jwalamukhi | చైతన్యానికి ప్రేరణలు.. జ్వాలాముఖి రచనలు..

జ్వాలాముఖిగా సుపరిచితులైన వీరవెల్లి రాఘవాచార్య(Veeravelli Raghavacharya).. తెలుగు సాహిత్యం(Telugu Literature)లో విప్లవాత్మక రచనల (Revolutionary Writings) ద్వారా ప్రత్యేక స్థానం సంపాదించిన కవి(Poet), రచయిత(Writer), మేధావి(Genius). ఆయన కేవలం సాహిత్య రంగంలోనే కాకుండా సామాజిక చైతన్యంలోనూ తనదైన ముద్ర వేశారు. సమాజంలోని అన్యాయాలను, అసమానతలను ఎండగట్టే రచనలతో, మానవతా విలువలను ప్రతిబింబిస్తూ జ్వాలాముఖి తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచారు.

జ్వాలాముఖి 1938 ఏప్రిల్ 12న మెదక్ జిల్లా ఆకారం గ్రామంలో జన్మించారు. న్యాయశాస్త్రం అభ్యసించినప్పటికీ ఆయన జీవితాన్ని సాహిత్యానికి అంకితం చేశారు. తొలుత నాస్తికవాదాన్ని స్వీకరించారు. అనంతరం మార్క్సిజం, మానవతావాదం వంటి విప్లవ భావజాలాలను తన రచనల ద్వారా ప్రచారం చేశారు. విరసం(విప్లవ రచయితల సంఘం) సభ్యుడిగా, భారత-చైనా మిత్ర మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకరు. మరో ఐదుగురు యువ కవులు నాగముని(ఎం.హెచ్.కేశవరావు), నిఖిలేశ్వర్(యాదవ రెడ్డి), చెరబండ రాజు(బద్దం భాస్కర్ రెడ్డి), భైరవయ్య(మన్ మోహన్ సహాయ్), మహా స్వప్న(కామిశెట్టి వెంకటేశ్వర్లు). విరసం సభ్యులు కూడా.

- Advertisement -

జ్వాలాముఖి సాహిత్య ప్రయాణం సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ సాగింది. ఆయన రచనలు ముఖ్యంగా అన్యాయం, అసమానతలను ఎండగట్టడమే కాకుండా, మానవతా విలువలను విశ్లేషించాయి. దిగంబర కవితా సంపుటాల ద్వారా తన విప్లవాత్మక దృక్పథాన్ని వ్యక్తం చేశారు. మనిషి దీర్ఘకవితకు 1958లో గుంటూరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ రచయిత పురస్కారం లభించింది. జనతా కథలు.. సామాజిక విప్లవాన్ని ప్రతిబింబించే కథల సంకలనం. మార్క్సిస్టు భావజాలంతో రాసిన వ్యాసాలు సమాజంలోని ఆర్థిక, రాజకీయ అసమానతలను వెలుగులోకి తేవడంలో కీలకంగా నిలిచాయి.

జ్వాలాముఖి కేవలం కవిగానే కాకుండా విప్లవకారుడు, నాస్తికుడిగానూ ప్రసిద్ధి. ఆయన రచనలు సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో దశదిశలా మార్గనిర్దేశం చేశాయి. రచనలు సరళంగానే ఉన్నప్పటికీ గాఢమైన రచనా శైలితో పాఠకుల గుండెలను తాకారు. జ్వాలాముఖి తన రచనల ద్వారా పేదలు, శ్రామికులు, దళితులు ఎదుర్కొంటున్న అన్యాయాలను నిర్భయంగా ఆవిష్కరించారు. మార్క్సిజం, నాస్తికవాదం ప్రభావంతో ఆయన రచనలు సామాజిక మార్పు, ప్రజాస్వామ్య హక్కుల కోసం పాఠకులను చైతన్యవంతం చేశాయి. 1971లో విరసం సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నిఖిలేశ్వర్, చెరబండ రాజులతో ముషీరాబాద్ జైల్లో 50 రోజులు గడిపారు. 1975 ఎమర్జెన్సీ కాలంలోనూ 15 రోజులు జైల్లో ఉన్నారు.

జ్వాలాముఖి రచనల్లో వాస్తవికత, సామాజిక బాధ్యత స్పష్టంగా కనిపిస్తాయి. వ్యక్తిగత అనుభవాలను కంటే సమాజంలోని వివిధ వర్గాల సమస్యల్ని చర్చించడంలో ఆయన కృతనిశ్చయంతో ఉండేవారు. బాల్యానికి రక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వార్ధక్యానికి పరిరక్షణ కల్పించగల వ్యవస్తే సోషలిస్టు సమాజం అని నొక్కి చెప్పారు. ఝాన్సీ హేతువాద మెమోరియల్ అవార్డు, దాశరథి రంగాచార్య పురస్కారం, హిందీలో వేమూరి ఆంజనేయ శర్మ అవార్డులను సొంతం చేసుకున్నారు.

జ్వాలాముఖి 2008 డిసెంబర్ 14న కన్నుమూశారు. అయితే.. ఆయన ఆలోచనలు, రచనలు ఇప్పటికీ మనకు మార్గదర్శకంగా నిలిచాయి. జ్వాలాముఖి సాహిత్యం తెలుగు సాహిత్యానికి విప్లవ స్వరాన్ని అందించింది. మానవతా విలువల ప్రతిబింబం అయిన ఆయన రచనలు.. నాస్తికవాదం, మార్క్సిజం వంటి దృక్పథాలతోపాటు సామాజిక బాధ్యతను చాటిచెబుతాయి. జ్వాలాముఖి రచనలు కేవలం సాహిత్య రంగానికే కాకుండా సమాజ చైతన్యానికి అనూహ్య ప్రేరణగా నిలిచాయి.

(డిసెంబర్ 14న జ్వాలాముఖి వర్ధంతి సందర్భంగా)

  • రామకిష్టయ్య సంగనభట్ల

- Advertisement -
RELATED ARTICLES

Latest News