Tuesday, February 10, 2026
Homeవరంగల్‌Celebrations | మురిసిన వంగర..పులకించిన భక్తజనం.

Celebrations | మురిసిన వంగర..పులకించిన భక్తజనం.

  • వంగరలో భక్తిప్రపత్తుల ‘రథ’ చక్రం.
  • పీవీ ప్రభాకర్ రావు నేతృత్వంలో వైభవంగా ఉత్సవం.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శతాబ్ది వేడుకగా వీరభద్ర స్వామి రథయాత్ర భక్త జనంతో పులకించిపోయింది. ఆధ్యాత్మికతకు అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే వంగర వీరభద్ర స్వామి రథయాత్ర జనసంద్రాన్ని తలపించింది. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఈ సంప్రదాయం, భక్తికి వారసత్వానికి వారధిగా నిలిచింది. పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, పీవీ శరత్ బాబు, పీవీ మదన్ మోహన్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు తనుగుల జితేందర్ రావు తదితర కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ యాత్ర అత్యంత వైభవంగా సాగింది.

ఈ రథయాత్ర కేవలం ఒక వేడుక కాదు, మా కుటుంబానికి దైవానికి ఉన్న అనుబంధం. మా నాయనమ్మ రత్నమ్మ పురుష సంతానం కోసం వీరభద్ర స్వామికి మొక్కుకుని, నాన్నని (పీవీ నరసింహారావు) దత్తత తీసుకోవడం వల్లే ఈ వంశం నేడు ఇలా ఉందనేది మా ప్రగాఢ విశ్వాసం. ఆ కృతజ్ఞతతోనే 1925 ప్రాంతంలో ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని నాన్న తన చివరి శ్వాస వరకు గౌరవించారు. ఆయన దేశ ప్రధానిగా ఉన్నా సరే, వంగర రథయాత్ర విశేషాలను అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడు ఆ పవిత్ర బాధ్యతను మోసే అవకాశం మాకు దక్కడం పూర్వజన్మ సుకృతం అని పీవీ ప్రభాకర్ రావు అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో దాదాపు 2,000 మంది భక్తులు పాల్గొన్నారు. పీవీ గ్లోబల్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో స్థానిక ప్రముఖులు మొండయ్య, వెంకట్ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వందేళ్ల నాటి ఈ చరిత్రను నేటి తరం యువతకు పరిచయం చేస్తూ, వంగర గ్రామ ఐక్యతను చాటిచెప్పడమే ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News