Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeసాహిత్యంవనజీవి ఆశయాన్నైనా బతికిద్దాం!

వనజీవి ఆశయాన్నైనా బతికిద్దాం!

  • చెట్ల రామయ్య మరణానికి స్పందిస్తూ కన్నీటి అక్షర నివాళి

చెట్లు కన్నీరు కార్చుతున్నాయి. వనాలు విలపిస్తున్నాయి. వాగులు వంకలు వగసి వగసి ఏడుస్తాన్నాయి. దరిపల్లి ఇంటి పేరును భారతావని వనజీవి లేదా చెట్లగా మార్చేసింది. దరిపల్లి రామయ్య 01 జూలై 1937న లాలయ్య-పుల్లమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించి, తన జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలు నాటి వనజీవి లేదా చెట్ల రామయ్యగా మారిపోయారు. 5వ తరగతి వరకు చదివిన రామయ్య ఉపాధ్యాయుల ప్రేరణతో చిన్నతనం నుంచే మొక్కల పెంపకాన్ని ఒక అభిరుచిగా మార్చుకొని ఇండ్లు, కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, ప్రైవేట్‌ ప్రాంగణాలు, దేవాలయాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతూ తన జీవితంతో హరిత వనాలను భాగం చేసుకున్నారు. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ తన జీవనోపాధిని కొనసాగించిన రామయ్య శుభకార్యాలకు మొక్కలను బహుకరించడం ప్రారంభించి మనకు మార్గం చూపారు.

మొక్కలే ప్రపంచంగా సాగిన చెట్ల రామయ్య జీవితం :
మొక్కలపై ఉన్న ప్రేమకు గుర్తుగా తన మనుమలు, మనుమరాళ్లకు హరిత లావణ్య, చందన పుష్ప, కబంధ పుష్ప, వనశ్రీ అని నామకరణం చేసి చెట్లపై తన ప్రేమను ప్రకటించారు. జీవితాంతం తన జీవనోపాధిని కొనసాగిస్తూనే, వర్షాకాలంలో మొక్కలు నాటడం, ఇతర సమయాల్లో అడవుల నుంచి విత్తనాలు సేకరించడం, విత్తనాలు పంచడం, వ్యర్థ పదార్థాల నుంచి ప్రచార సామాగ్రిని తయారు చేసుకోవడం, వృక్షోవృక్షతి రక్షిత నినాద ప్లేకార్డులను సగర్వంగా చేత పట్టుకొని తిరగడం, చిన్న చిన్న మట్టి కుండలు/ప్లాస్టిక్‌ డబ్బాలు/రింగుల్లో కూడా మొక్కలు పెంచడం తన నిత్యకృత్యంగా మారింది. రామయ్య కృషిని గుర్తించిన మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా కూడా బోధించడం హర్షదాయకం.

వనజీవి రామయ్య కృషిని గుర్తించిన ప్రభుత్వాలు 2017లో పద్మశ్రీ, వనమిత్ర, గౌరవ డాక్టరేట్‌, 1995లో భారత ప్రభుత్వ వనసేవా పురస్కారం, రోటరీ క్లబ్ అవార్డు, రాష్ట్ర ప్రభుత్వం మోపెడ్‌తో పాటు నెలకు 1500/- భత్యం లాంటి గుర్తింపును పొందారు. తన 87వ ఏట 12 ఏప్రిల్‌ 2025న గుండెపోటుతో మరణించిన చెట్ల రామయ్య వదిలి వెళ్లిన హరిత పర్యావరణ ఉద్యమం నిరంతరం కొనసాగాలి, భవిష్యత్తు తరాలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. ఆయన మరణించినా ఆయన ఆశయాన్ని మాత్రం బతికించే గురుతర బాధ్యత మనం మీద ఉన్నది.

  • డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037
RELATED ARTICLES
- Advertisment -

Latest News