Friday, February 27, 2026
Homeసాహిత్యంUnicef | ప్రపంచ బాలల ఆత్మీయ నేస్తం

Unicef | ప్రపంచ బాలల ఆత్మీయ నేస్తం

యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ (Childrens) ఎమర్జెన్సీ ఫండ్(Unicef)ను 1953 నుంచి అధికారికంగా ‘యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్ ఎమర్జన్సీ ఫండ్’గా పేర్కొంటున్నారు. ఈ సంస్థ డిసెంబర్ 11న 78వ వ్యవస్థాపక దినోత్సవాన్ని (Foundation Day) జరుపుకోబోతోంది. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలలు ఘనంగా నిర్వహించుకోవడం సముచితంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధ (Second World War) సమయంలో (1946లో) తాత్కాలికంగా ఏర్పడ్డ యూనిసెఫ్‌‌ను తదనంతర కాలం(1953)లో ఐక్యరాజ్యసమితి(UNO)కి శాశ్వత అనుబంధ సంస్థగా గుర్తించారు.

యూనిసెఫ్ వ్యవస్థాపక‌ దినోత్సవం-2025 ఇతివృత్తం.. ‘నా రోజు, నా హక్కులు’(My Day My Rights‌). ప్రపంచవ్యాప్తంగా 34 నేషనల్‌ కమిటీలు, 7 ప్రాంతీయ కార్యాలయాలు, పరిశోధన కేంద్రం, సరఫరా కేంద్రం, పలు సేవల కేంద్రాలతో నడుస్తోంది. యూనిసెఫ్‌ సిబ్బంది 85 శాతం క్షేత్ర స్థాయిలోనే సేవలు అందిస్తుండటం విశేషం.

- Advertisement -

ప్రధాన‌ విధులు:

ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణే ఏకైక లక్ష్యంగా యూనిసెఫ్‌ సేవలు అందిస్తోంది. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాల వృద్ధి, మాతాశిశు సంరక్షణ, పోషకాహార కల్పన, వ్యాధుల నివారణకు టీకాలు ఇప్పించడం, లింగ సమానత్వ సాధనకు కృషి చేయడం, అత్యవసర సేవలు అందించడం, బాల కార్మిక వ్యవస్థలను ఛేదించడం, బాలల కనీస అవసరాలను తీర్చడం, సురక్షిత నీరు-పారిశుద్ధ్య కల్పన, విపత్తు ప్రాంతాల్లో పిల్లల సంరక్షణ బాధ్యతలు చేపట్టడం, యుద్ధ ప్రాంతాల్లో బాలలకు బాసటగా నిలవడం, బాలికల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయడం, బాలల శక్తి దుర్వినియోగానికి వ్యతిరేకంగా కృషి చేయడం, బాలల అక్రమ రవాణాను అరికట్టడం, నిరుపేద పేద పిల్లలను అక్కున చేర్చుకోవడం, శిశు మరణాల రేటును తగ్గించడం లాంటి పలు సమకాలీన బాలల సమస్యలకు సరైన పరిష్కారాలు వెతుకుతూ చిన్నారుల ఉజ్వల భవితకు గొడుగులు పడుతూ ముందుకు సాగుతోంది.

మానవీయ దృక్పథం

ప్రపంచ అభాగ్య బాలలను అన్ని రకాలుగా ఆదుకోవడమనే ఏకైక లక్ష్యంతో 1946లో ఏర్పడ్డ యూనిసెఫ్‌.. 190కి పైగా దేశాల్లో తన లక్ష్య సాధనకు కృషి చేస్తోంది. 1965లో నోబెల్‌ శాంతి బహుమతిని పొందింది. యూనిసెఫ్‌ సంస్థ నిరంతరం ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు మేనమామగా మారి అక్కున చేర్చుకుంటూ వారి ముఖాల్లో నవ్వుల పువ్వులు వికసించేలా చేయూతను అందిస్తోంది. న్యూయార్క్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. యూనిసెఫ్‌ను 1946లో లుడ్విక్‌ రజ్‌మెన్‌ స్థాపించారు. ఐరాస సభ్య దేశాల్లో ఒకటైన అమెరికా లాంటి అగ్ర దేశాలు అధికంగా నిధులను అందిస్తున్నాయి.

నేటి బాలల రేపటి ఉజ్వల భవితకు నేడే పెట్టుబడి పెట్టాలనే ధ్యేయంతో యూనిసెఫ్‌ ముందుకు సాగుతోంది. పిల్లల భావనలకు పట్టం కట్టడం, వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఊతం ఇవ్వడం గత 78 ఏళ్లుగా కొనసాగుతోంది. నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 760 మిలియన్ల మంది బాలలను యూనిసెఫ్‌ ఆదుకుంది. రేపటి తరం నిర్మాణానికి నేడే మనం త్యాగాలు చేయడం, యునిసెఫ్ చేతులకు దండం పెట్టడం మన కనీస కర్తవ్యం. ఆపదలోని చిన్నారులకు అమ్మ, భయం గుప్పిట ఉన్న చిన్నారులకు నాన్న, చిరునవ్వుల చిన్నారులకు ఆత్మీయ నేస్తంగా పలు భూమికలు పోషిస్తున్న యూనిసెఫ్ అమూల్య సేవలను కొనియాడుతూ ఆ సంస్థ విజయాలపై యువతకు అవగాహన పెంచుదాం. ‘లాంగ్ లివ్‌ యూనిసెఫ్‌ హెల్పింగ్‌ హాండ్‌’.

(డిసెంబర్‌ 11: యూనిసెఫ్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా)

డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES

Latest News