కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం
సహచర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మేడారం సందర్శన
సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) మహా జాతర(Maha Jatara) సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం(Union Tribal Affairs Minister Shri Jual Oram) గురువారం సహచర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)తో కలిసి మేడారం సందర్శించారు. సమ్మక్క, సారలమ్మకు పూజలు చేశారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దానసరి అనసూయ(సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రధాన ఆలయ ద్వారం వద్ద కేంద్ర మంత్రులకు హృదయ పూర్వక స్వాగతం పలికారు. సాంప్రదాయ గిరిజన డప్పుచప్పుళ్ల మధ్య మంత్రులను ఆలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక ఆచారాలు నిర్వహించారు. తర్వాత.. వారు ప్రధాన దేవతలకు నిలువెత్తు బంగారం(బంగారు నైవేద్యం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం.. కేంద్ర మంత్రి ఓరం మీడియాతో మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అని, గిరిజన వర్గాల మహా కుంభమేళా అని చెప్పారు. దాదాపు 20 ఏళ్ల కిందట మేడారం సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తాను మళ్లీ మేడారానికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని పేర్కొన్నారు. జాతర సజావుగా నిర్వహించడానికి సహాయం చేయడంతోపాటు భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశామని వెల్లడించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన వర్గాలకు అతిపెద్ద పండుగని, వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులను దాదాపు నెల రోజుల పాటు ఆకర్షిస్తుందని చెప్పారు. జాతర కోసం చక్కగా ఏర్పాట్లు చేసినందుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరిలతోపాటు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను చేపడుతున్నాయని చెప్పారు.
