- బస్తీ బాట పట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- జీహెచ్ఎంసీ విభజనపై తీవ్ర ఆరోపణలు – నగర రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు
- రాష్ట్ర ప్రభుత్వ పాలనపై దుమ్మెత్తి పోసిన మంత్రి
- హైదరాబాద్ సమస్యలకు సీఎం బాధ్యత వహించాలి
- ఎంఐఎం కనుసనల్లో ప్రజా పాలన నడుస్తుంది
- అధికారులను వెంటబెట్టుకొని బస్తీల్లో పర్యటన
- బస్తీల ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ,అడ్డగుట్ట,తార్నాక డివిజన్ లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం నాడు బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక రెడ్డి, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి,లతో కలిసి బస్తీ సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలపై సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమం,స్థానికుల మౌలిక సమస్యలపై దృష్టి సారించి,ప్రజలను స్వయంగా కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు.వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో బస్తీల్లో జనాభా వేగంగా పెరుగుతోందని, ప్రతిరోజూ కొత్త కాలనీలు,కొత్త అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయని తెలిపారు.ప్రతి ఆరు నెలలకోసారి నగర స్వరూపమే మారిపోతోందని వ్యాఖ్యానించారు.150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విభజించి,ఒక్క కార్పొరేషన్‌ను మూడు ముక్కలుగా చేయడం వెనుక భారతీయ జనతా పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే అక్కసే కారణమని ఆరోపించారు.హైదరాబాద్ కోర్ సిటీని మజ్లిస్ పార్టీకి అప్పగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందన్నారు.

ఎంఐఎం, కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని విమర్శించారు.హైదరాబాద్‌కు తగినంత నీటిని తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.ఎండాకాలం మొదలవడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఎండాకాలం మొదలు ముందే హైదరాబాద్‌లో వర్షపు నీటి కాలువల్లో యుద్ధప్రాతిపదికన సిల్ట్ తొలగించాల్సి ఉండగా,ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
పేపర్ల మీద మాత్రం కాంట్రాక్టర్లు సిల్ట్ తీసినట్లు చూపించి,చెల్లింపులు చేసుకున్నారని ఆరోపించారు.బస్తీల్లో కాలువల్లో పేరుకుపోయిన పూడికను కూడా తొలగించడం లేదని,దీని వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని తెలిపారు.హైదరాబాద్ ప్రజల సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే ఉందని స్పష్టం చేశారు.ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి,పెండింగ్‌లో ఉన్న సమస్యలపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ పాలకవర్గం రద్దయిన నేపథ్యంలో,ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలను నేరుగా కలుసుకుంటూ, అధికారులతో కలిసి పాదయాత్రలు నిర్వహించి, సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా తాను నిరంతరం కృషి చేస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
