- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కేంద్రం శుభవార్త
- నినాదాలతో మారుమోగిన రైల్వే స్టేషన్
- తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
- కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇకపై మంచిర్యాలలో కూడా ఆగనుంది. ఈ హాల్టింగ్‌ను సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు జై బీజేపీ, జై బండి సంజయ్ అంటూ నినాదాలతో స్టేషన్ ప్రాంగణం మారుమోగించారు. కార్యక్రమంలో అక్కడక్కడ గందరగోళం నెలకొనడంతో, బండి సంజయ్ గొడవలు కాదు, అభివృద్ధే లక్ష్యం కావాలంటూ కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 150 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, తెలంగాణలో ఇప్పటికే 5 రైళ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలో హైదరాబాద్ – పుణే, హైదరాబాద్ – నాందేడ్ మార్గాల్లో కూడా వందే భారత్ సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు. 2014లో తెలంగాణకు కేవలం రూ.258 కోట్లు రైల్వే బడ్జెట్ కేటాయించగా, ఈసారి రూ.5,300 కోట్లు కేటాయించామని తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రానికి రూ.42 వేల కోట్లు ఖర్చు చేశామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే అది రూ.80 వేల కోట్లకు చేరుకుంటుందని వివరించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రామగుండం, కరీంనగర్, సికింద్రాబాద్, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అవసరాలు, డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ ఏర్పాటు చేశాంమని బండి సంజయ్ పేర్కొన్నారు.

రైల్వే కనెక్టివిటీతో అభివృద్ధి సాధ్యం: ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాలలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ కల్పించినందుకు కేంద్ర రైల్వే శాఖకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే కనెక్టివిటీతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో మొదటిసారి రైల్వే బడ్జెట్‌పై మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు పెద్దపల్లి, మంచిర్యాల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలని కోరాను. ఆ తర్వాత అనేకసార్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే అధికారులను, ఢిల్లీలో ఉన్నతాధికారులను, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విన్నవించాను. ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా రైల్వే శాఖకు ఏటా రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోందని గుర్తుచేశారు. గతంలో కాకా వెంకటస్వామి, మాజీ మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల, పెద్దపల్లిలో రైళ్ల హాల్టింగ్, కొత్త రైళ్ల ప్రారంభం కోసం కృషి చేశారని, వారి బాటలో తానూ నడుస్తానని అన్నారు.

కొత్త రైళ్ల ప్రారంభానికి కృషి చేశా: మంత్రి వివేక్
గతంలో తాను పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు కొత్త రైళ్ల ప్రారంభానికి కృషి చేశానని మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు. ఎంపీగా గెలిచిన వంద రోజుల్లోనే సికింద్రాబాద్ – బెల్లంపల్లి ఇంటర్‌సిటీ రైలు శాంక్షన్ చేయించాను. రామగుండం, క్యాతనపల్లిలో రెండు రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయించానని వివరించారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఉదయం రైలు సౌకర్యం లేకపోవడం వలన ఇబ్బంది కలిగేదని, ఇప్పుడు వందే భారత్ హాల్టింగ్‌తో ఆ సమస్య పరిష్కారమైందని తెలిపారు. శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మంచిర్యాలలో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలంటూ కేంద్ర మంత్రి సంజయ్‌ను కోరినట్లు చెప్పారు. రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను రూ.10 వేల కోట్లతో తిరిగి ప్రారంభం చేయించామని, అయితే హెడ్ ఆఫీస్ హర్యానాలో ఉండటం వల్ల పర్యవేక్షణ లోపించి ప్లాంట్ కొద్దిరోజులుగా మూతపడిందని, దాంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని వివేక్ తెలిపారు. మంచిర్యాల ప్రజలు వందే భారత్ రైలును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలియజేశారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ, రూ.3.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం. గోపాలకృష్ణన్, చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్, మంచిర్యాల డివిజన్ ఏసీపీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
