- కొనియాడిన డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు..
- వృద్ధి, ఉపాధి, సామాజిక సమతుల్యానికి విధాన దిశ..
- ఉపాధి, జీవనోపాధి, మౌలిక వసతులపై కేంద్రీకృత దృష్టి..
- ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే బడ్జెట్ కేంద్రబిందువు..
కేంద్ర బడ్జెట్ 2026–27ను వృద్ధి, ఉపాధి, సామాజిక సమతుల్యాన్ని సమన్వయపరిచే విధాన ప్రకటనగా రూపొందించారని సామాజిక శాస్త్రవేత్త, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు విశ్లేషించారు. బడ్జెట్‌పై స్పందించిన ఆయన, తక్షణ వినియోగానికి పరిమితం కాకుండా ఉపాధి, జీవనోపాధి, మౌలిక వసతులు, మానవ మూలధనం వంటి రంగాలపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.
గ్రామీణ ఉపాధి.. జీవనోపాధి స్థిరత్వానికి వీబీ-జీ రామ్ జీ కోసం రూ. 95,692 కోట్ల కేటాయింపు కీలకమని పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి మూలధన వ్యయంగా సుమారు రూ. 12.2 లక్షల కోట్లు కేటాయించడం ఉపాధి సృష్టికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

తయారీ రంగంలో యువత ఉపాధితో అనుసంధానమైన వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీకి రూ. 40,000 కోట్లు, ఎం ఎస్ ఎం ఈల కు రూ. 10,000 కోట్ల మద్దతు ఇవ్వడం ఆర్థిక స్థిరత్వాన్ని బలపరుస్తుందని తెలిపారు. విద్య రంగానికి సుమారు రూ. 1.39 లక్షల కోట్ల కేటాయింపు మానవ మూలధన నిర్మాణానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
మొత్తంగా ఈ బడ్జెట్ సంక్షేమ పంపిణీకి పరిమితం కాకుండా, ఉపాధి, అవకాశాల విస్తరణపై ఆధారపడి ఉన్న ‘భవిష్యత్ భారత్ దర్శనం’ ను ప్రతిబింబించేలా రూపొందించారని డాక్టర్ వకుళాభరణం తెలిపారు.
