- తిరుమలలో మహాద్భుత ఘట్టం..
- స్వామివారికి పంచాంగం సమర్పించనున్న ఆస్థాన సిద్ధాంతి..
శ్రీస్వామి వారి పాదపద్మాల మీదనున్న పంచాంగాన్ని భక్తితో స్వీకరించి, ఆస్ధానసిద్ధాంతి శ్రీస్వామివారికి నూతన పంచాంగ విశేషాలు విన్పిస్తారు. ప్రత్యేకంగా శ్రీవారి జన్మ నక్షత్రమైన ‘శ్రవణం’ ఫలితాలు వివరిస్తూ “ఓ స్వామీ! మీరు ఈ లోకంలో అవతరించింది – శ్రవణా నక్షత్రం నాడు. ఈ సంవత్సరంలో మీరు విశేషదయాతరంగులై భక్తుల పాపాలను పొగొట్టి ‘వేంకట’నామాన్ని సార్ధకం చేసుకొంటారు. భక్తులకు సకలసంపదలూ అను గ్రహిస్తారు.
కనుకనే భక్తకోటి ఈసంవత్సరంలో మీదర్శనానికై అఱ్ఱులు చాస్తూ, తిరుమలయాత్ర చేస్తారు. మీదయకై, ఆనందానికై ఎన్నో ఉత్సవాలు ఎంతో వైభవంగా భక్తితో నిర్వహిస్తారు. మీకు విశేషంగా ధనవస్తురూపంలో కానుకలు సమర్పిస్తారు. మీ ఆజ్ఞావర్తులైన నవగ్రహాలూ మీ భక్తుల్ని రక్షిస్తూంటారు. దేశం సస్యశ్యామలమై వర్ధిల్లుతుంది. మీదయ వల్ల అతివృష్టి, అనావృష్టి, ఆధివ్యాధులూ లేక విశ్వం హాయిగా వుంటుంది” – అని విన్నవిస్తారు – సిద్ధాంతిగారు.
ఆ సమయంలో శ్రీస్వామి వారు అరమోడ్పుకన్నులతో, మందహాసంతో, సంతోషంతో వింటూ అందర్నీ దీవిస్తున్నట్లుగా దివ్యకాంతుల్తో సాక్షాత్కరిస్తారు.
శ్రీదేవీ భూదేవులకు కూడా నక్షత్రఫలాలు చెప్పిన తర్వాత అక్కడ నున్న పెద్ద లెవరైనా తమ నక్షత్ర ఫలితాలు తెల్పండని అర్థిస్తే – సిద్ధాంతిగారు వారి నక్షత్రఫలితాలు విన్పిస్తారు. పిదప అర్చకస్వాములు సిద్ధాంతిగారికి శఠారిని అనుగ్రహిస్తారు.
పిదప జియ్యంగార్ల గుమాస్తా వచ్చి, ముందురోజు వచ్చిన హుండీరాబడినీ, ఆదాయవ్యయాలనూ, ఉత్సవ విశేషాలనూ స్వామివారికి విన్పిస్తారు. వెంటనే అర్చకస్వాములు శ్రీమలయప్ప స్వామివారలకు “కొలువు పళ్లెం” అనబడే బంగారుతట్టలో నవనీతహారతిని జరిపి, కార్యనిర్వహణాధికారి గారికి నవనీతం (వెన్న) తాంబూలం ఇస్తారు. పిదప సర్కారు హారతులు కార్యనిర్వహణాధికారి మొదలు పారుపత్యదారువరకూ ఒక్కొక్కరికి ఒక్కొక్క హారతి క్రమంగా నిర్వహిస్తారు.
తరువాత మైసూరువారి, తాళ్ళపాకవారి, తరిగొండ వారి హారతులూ జరుగుతాయి. చివరగా భక్తులందరి తరఫున ఒక్కొక్క రూపాయివంతున సేకరించి “రూపాయహారతి” ఇస్తారు. పళ్ళెంలో వచ్చిన రూపాయల్ను కార్యనిర్వహణాధికారి ఖజానాకు జమ చేస్తారు.
చివరగా జియ్యంగారికీ, పిదప దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారికీ పరివట్టం కట్టి, శఠారిని అనుగ్రహిస్తారు. పిదప ప్రసాద వినియోగం జరుగుతుంది. చందనతాంబూలాలూ, అక్షతలూకూడా ప్రసాదంతో పాటు ఇస్తారు.
ఇలా ‘ఉగాది ఆస్థానం’ పూర్తి అయ్యాక, భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉగాదిరోజు కల్యాణోత్సవం మున్నగు ఆర్జితోత్సవ సేవలు ఏవీ ఉండవు.
సాయంకాలం తిరుమల నాల్గుమాడవీథుల్లో శ్రీభూదేవీసమేతంగా శ్రీమలయప్పస్వామి వారు ఉత్సవంగా వచ్చి, భక్తులకు నూతన సంవత్సర శుభాశీస్సులతో పాటు, దివ్యమంగళ దర్శనం కూడ అనుగ్రహిస్తారు.
ఉగాది నాడు సాయంకాలం ప్రారంభమైన ఈ ఉత్సవం 40 రోజులు విధిగా జరుగుతుంది. దీన్ని “నిత్యోత్సవం” అంటారు. వైశాఖ శుద్ధ దశమి వరకూ ఈ ఉత్సవం ఆగమ సంప్రదాయబద్ధంగా నిర్వహింప బడుతుంది..
