- తిరుమల కొండల్లో నెలకొన్న పుణ్య తీర్ధం..
- చైత్ర శుద్ధ చతుర్థినాడు రెండు రోజుల పాటు ఉత్సవాలు..
కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాల్లో ప్రశస్తమైనవి ముఖ్యంగా ఏడు తీర్ధాలు. అవి శ్రీవారి పుష్కరిణి, కుమారధార, తుంబుర తీర్ధం, రామకృష్ణ తీర్ధం, ఆకాశగంగ, పాపవినాశనం, పాండవ తీర్థాలు. ప్రతి సంవత్సరం ఈ పవిత్ర తీర్ధాలకు ముక్కోటి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
చైత్ర శుద్ధ చతుర్దశి, చైత్ర పౌర్ణమి రెండు రోజుల పాటు తిరుమల గిరుల్లోని పవిత్ర తీర్ధమైన తుంబుర తీర్ధ ముక్కోటి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తుంబుర తీర్ధ విశిష్టతను తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం తుంబురుడు ఒక గంధర్వుడు. తుంబురుడు కశ్యప ప్రజాపతి కుమారుడు. గొప్ప సంగీత విద్వాంసుడు. నారదునితో కలిసి పరమశివుని డమరుక నాదం నుంచి జన్మించిన సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రసిద్ధ గాయకుడు. ఈయన ‘కళావతి’ అనే వీణను ధరిస్తాడు. జంట గాయకులుగా ప్రసిద్ధి చెందిన నారద, తుంబురులు సంగీత కళా ప్రచారకులు. తిరుమలలోని తుంబురుడు తపస్సు చేసిన పవిత్ర స్థలం ‘తుంబురు తీర్థంగా ప్రసిద్ధి చెందింది.
గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలోనే పూర్వం తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది. నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో అలిగిన తుంబురుడు వెనక్కి తగ్గి ఈ తీర్థంలోనే కూర్చుండి పోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్వయంగా వేంకటేశ్వర స్వామి వెళ్లి తుంబురుడిని బుజ్జగించారని, అందుకే ఆ ప్రాంతానికి తుంబుర తీర్థంగా పేరు గాంచిందని స్థల పురాణం.
మరో కథనం ప్రకారం మోక్ష కాముకుడైన తుంబురుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని ఉపదేశించమని మహర్షులను కోరగా వారు తిరుమలలోని ఈ తీర్థంలో స్నానమాచరించమని గంధర్వునికి సూచించారు. మహర్షులు సూచించిన ప్రకారం ఆ గంధర్వుడు తిరుమల సమీపంలోని ఈ తీర్ధంలో స్నానం చేసి మోక్షాన్ని పొందాడట. ‘తుంబురుడు’ మోక్షాన్ని పొందిన తీర్థం కనుక, ఈ తీర్థానికి ‘తుంబుర తీర్థం’ అనే పేరు వచ్చిందని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
