- వైశ్య సంఘాల అభ్యున్నతి సంకల్పంతో సేవా కార్యక్రమాలు
- పంచాంగం పుస్తకాన్ని ఆవిష్కరించిన కాచిగూడ వైశ్య హాస్టల్ అధ్యక్షుడు ఉప్పల రాజేశ్వర్‌రావు
నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తుకారాంగేట్ కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు మల్లవోలు శ్రీకాంత్ మాధవ్,ప్రధాన కార్యదర్శి నాగబండి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో గురువారం నూతన పంచాంగాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి కాచిగూడ వైశ్య హాస్టల్ అధ్యక్షుడు ఉప్పల రాజేశ్వర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై పంచాంగాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశ్య సంఘాల అభ్యున్నతే తన లక్ష్యమని స్పష్టం చేశారు.సేవా భావంతోనే తమ సంస్థల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కాచిగూడతో పాటు ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఉన్న వైశ్య హాస్టళ్లు,వాసవి సేవా కేంద్రం ఆధ్వర్యంలో వైశ్య సంఘాల విద్యార్థులకు స్కాలర్‌షిప్లు అందజేస్తున్నామని వివరించారు.అలాగే,ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ ఉచిత వైద్య శిబిరాలు,ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.జీవనోపాధి కోసం కుట్టుమిషన్లు అందించడం,చిన్న వృత్తులు చేసుకునే వారికి సహాయం చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని తెలిపారు.
స్కాలర్‌షిప్ల కోసం వచ్చిన దరఖాస్తులను తానే స్వయంగా పరిశీలించి అర్హులైన వారికి అందజేస్తున్నామని గుర్తుచేశారు.ఆర్యవైశ్య సంఘం తుకారాంగేట్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ఆయన,సంఘం సభ్యులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సభ్యుడికి పంచాంగాలను ఆయన చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి నూకల నర్సింగ్‌రావు,మాజీ గౌరవ అధ్యక్షులు,కార్యదర్శులు,సంయుక్త కార్యదర్శులు,సలహాదారులు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
