- దేశవ్యాప్త రాజధానుల్లో స్వామి వారి ఆలయ నిర్మాణాలు..
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్ని ప్రాశస్త్యాన్ని చాటిచెబుతున్న టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, రాజధానుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడంతో టీటీడీ పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
ఈ మేరకు నిధులు కేటాయించడంతోపాటు పనులను వేగవంతం చేసే ప్రణాళికకు కసరత్తు ప్రారంభించింది. తమిళనాడులోని ప్రముఖ రియల్టర్ సంస్థ కోయంబత్తూరులో ఆలయ నిర్మాణానికి 19.62 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందు కొచ్చింది. ఈ ప్రతిపాదనను టీటీడీ మండలి ఆమోదించింది. త్వరలోనే ఆ భూమిని టిటిడి రిజిస్ట్రేషన్ చేసు కుని ఆలయాన్ని నిర్మించబోతోంది. ఇక అస్సాంలోని కామరూప్ జిల్లా పన్ బారీ మౌజీ, అమెరిగోగ్ గ్రామంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 10.32 ఎకరాలను రూ. 28,09,800లకు అక్కడి ప్రభుత్వం టీటీడీకి విక్రయించింది.
టీటీడీ సొంత నిధులు, లేదంటే దాతల విరాళాలతో ఆలయాన్ని నిర్మించాలనుకుంటోంది. ఇక నవీ ముంబయిలోని ఉల్వేలో దాదాపు 10 ఎకరాల్లో రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా రూ.100 కోట్ల విరాళంతో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా పనులు పూర్తి కాగా జూన్ లో ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి ఆలయంలో నెలకొల్పే మూలమూర్తులకు 3 కిలోల బంగారంతో కవచాలను తయారు చేసేందుకు టీటీడీ ఆమోదించింది
