- పాము కాటు వ్యవహారంపై టీటీడీ వివరణ..
తిరుమలలో దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు అని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని టీటీడీ వెల్లడించింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారని వివరించారు.
ఈ నేపథ్యంలో ట్యాక్సీలో మ్యూజియం సమీపాన ఉన్న ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియాకు చేరుకోగానే మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లిందన్నారు. ఈ క్రమంలో కాలుపై స్పర్శ తగలడంతో భయపడి భర్త శరత్ వివరించగా ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించిందన్నారు.
వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారని, వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి పాము కాటు లేదని నిర్ధారించారని వివరించారు. అయినప్పటికీ మహిళా భక్తురాలి ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారని వెల్లడించారు. ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తేలిందన్నారు. సోమవారం ఉదయం దంపతులు క్షేమంగా శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు.
భక్తులు తమ భద్రత దృష్ట్యా టీటీడీ నిర్దేశించిన ప్రాంతాల నుంచి మాత్రమే క్యూలైన్లలోకి వెళ్లాలని, తిరుమల పరిసరాల్లోని నిషేధిత అటవీ ప్రాంతాల్లో సంచరించవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది .
