- గద్దకు ప్రాణ రక్షణ!!
బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (TTI) ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు కొమ్మలకు కట్టిన పదునైన, నిషేధిత మాంజాలో ఒక గద్ద చిక్కుకునీ విలవిలలాడుతోంది. ఈ సంఘటనను అటుగా వెళ్తున్న అదనపు ఉప పోలీస్ కమిషనర్, ట్రాఫిక్-1, మల్కాజ్‌గిరి ఎ లక్ష్మి, తిరుమల గిరి ట్రాఫిక్ సహాయ పోలీస్ కమిషనర్, జి, శంకర్ రాజు గమనించి తక్షణ స్పందనతో పాటు మానవత్వం, ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సహకారంతో, గద్దకు మరింత హాని కలగకుండా ఎంతో జాగ్రత్తగా చెట్టుపై నుండి దింపి, దాని కాళ్లకు బిగుసుకుని ఉన్న నిషేధిత మాంజాను సహనంతో తొలగించి అవసరమైన సంరక్షణ అందించారు. అధికారుల, సిబ్బంది సమయోచిత చర్యల వల్ల గద్ద ప్రాణాపాయం నుండి తప్పించుకొని కొద్ది సేపటి తరువాత సురక్షితంగా ఎగిరిపోయింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నిషేధిత మాంజా వాడకం పక్షులు, జంతువులకే కాకుండా మానవ జీవితాలకు కూడా తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని, పలుమార్లు ప్రాణాంతక గాయాలు మరియు మరణాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని కచ్చితంగా పాటిస్తూ, నిషేధిత మాంజా వాడకాన్ని పూర్తిగా మానుకొని, ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సంఘటన ద్వారా, ట్రాఫిక్ పోలీసు శాఖ కేవలం రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణకే పరిమితం కాకుండా, మాటలేని పక్షుల ప్రాణాలను కూడా కాపాడే సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నదని స్పష్టమవుతోంది.
