ఏటా సంక్రాంతి వేళ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచి లక్షలాది మంది సొంతూళ్లకు బయలుదేరతారు. ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనాల్లో వెళ్లడం వల్ల జాతీయ రహదారులపై ట్రాఫిక్ పెరుగుతోంది. ముఖ్యంగా టోల్‌ప్లాజాల(Toll Plaza) వద్ద వాహనాలు(Vehicles) కిలోమీటర్ల మేర నిలిచిపోవడం సాధారణమైపోయింది. గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో ప్రయాణికులు(Passengers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టోల్ ఫ్రీపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచన
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పండుగ రోజుల్లో టోల్ ఫ్రీ సదుపాయం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఆలోచిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి, మేడారం(Medaram) జాతర వంటి ప్రత్యేక సందర్భాల్లో టోల్ వసూలు నిలిపివేస్తే ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.
కేంద్రం అనుమతి కీలకం
టోల్ మినహాయింపు అమలుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా వాహనదారుల టోల్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని, ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.
ఓకే అంటే బిగ్ రిలీఫ్
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే విజయవాడ, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి ప్రధాన రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట లభించనుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా ఫ్రీ వే ఏర్పాటు చేస్తే ప్రయాణం మరింత సాఫీగా, వేగంగా సాగుతుందన్నది అధికారుల అంచనా.
ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్
సంక్రాంతి, మేడారం జాతరల వేళ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. పండుగ సమయంలో టోల్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలనే అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)కి లేఖ రాయాలని నిర్ణయించాం. టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

