టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ఇకపై బిగ్గెస్ట్ రైవలరీ మ్యాచ్ కాదని టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. ఇరు జట్ల గెలుపోటములు తెలుసుకుంటే.. ఇది గొప్ప రైవలరీ అవ్వదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్థాన్ ఫ్యాన్స్ మండిపోయేట్టు చేస్తున్నాయి. ఆసియా కప్ 2025 సూపర్ 4 రౌండ్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో వారు 172 పరుగుల లక్ష్యాన్ని సులభంగా సాధించారు. పాకిస్తాన్‌పై భారత జట్టు భారీ విజయం సాధించిన తర్వాత.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో పాకిస్థాన్ జట్టుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాక్ జట్టుపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
భారతదేశం – పాకిస్తాన్ మ్యాచ్ రైవలరీ మ్యాచ్ కాదని.. పాకిస్థాన్ బలమైన జట్టు కాదని ఆయన చేసిన ప్రకటనతో పాకిస్థాన్ ఫ్యాన్స్ అందరూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఆదివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్సీలోని పాకిస్థాన్ జట్టును టీమ్‌ఇండియా మరోసారి మట్టికరిపించింది. ఈ పరిస్థితిలో మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ భారతదేశం – పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఒక ప్రశ్నను లేవనెత్తారు. సూర్యకుమార్ ఆలోచించకుండా.. ‘‘నేను ఈ ప్రశ్నకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ భారతదేశం – పాకిస్తాన్ మ్యాచ్ గురించి ప్రశ్నలు అడగడం మానేయాలని నేను భావిస్తున్నాను’’ అని స్పందించారు. ‘‘రెండు జట్లు 15-20 మ్యాచ్‌లు ఆడగా.. గెలుపు-ఓటముల రికార్డు 7-7 లేదా 8-7 అయితే, అది మంచి రైవలరీ మ్యాచ్ అంటారు. అలాంటివి అసలైన మ్యాచ్‌లు. కానీ గెలుపు – ఓటముల రికార్డు 13-0 లేదా 10-1 లాగా ఏకపక్షంగా ఉంటే.. దానిని రైవలరీ మ్యాచ్ అని ఎలా పిలుస్తారు? మేము వారి కంటే మెరుగైన క్రికెట్ ఆడాము’’ అని టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కుండబద్ధలు కొట్టారు. గత ఎనిమిది రోజుల్లో భారత్ రెండుసార్లు పాకిస్థాన్‌ను ఓడించినందున సూర్యకుమార్ కామెంట్స్ ఇప్పుడు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
సూపర్ 4 రౌండ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.5 ఓవర్లలోనే విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ల కృషితో ఈ విజయం సాధ్యమైంది. పాకిస్థాన్ తరఫున సాహిబ్‌జాదా ఫర్హాన్ ప్రశాంతంగా అర్ధ సెంచరీ సాధించాడు. కానీ మిగతా ఆటగాళ్లెవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత పార్ట్ టైమ్ బౌలర్ శివమ్ దూబే కీలక వికెట్లు తీసి పాకిస్థాన్ పరుగుల వేగాన్ని తగ్గించాడు. గత 15 ఏళ్లలో భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన 31 మ్యాచ్‌లలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. 23 మ్యాచ్‌లలో విజయం సాధించింది. టెస్టులు, వన్డేల్లో పాకిస్తాన్ మొత్తం మీద ఆధిక్యంలో ఉండగా.. టీ20ల్లో భారత్ 15 మ్యాచ్‌లలో 11 మ్యాచ్‌లలో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ గణాంకాలు సూర్యకుమార్ యాదవ్ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
