ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో రసాయన పురుగు మందుల(Chemical Pesticides) వాడకం తప్పనిసరిగా మారింది. పంటలను చీడపీడల నుంచి కాపాడి, ఎక్కువ ఉత్పత్తి(More Production) సాధించడానికి ఇవి చాలా తోడ్పడుతున్నాయి. అయినప్పటికీ ఈ రసాయనాలను అధికంగా, సరైన జాగ్రత్తలు లేకుండా వాడటం వల్ల ప్రజల ఆరోగ్యాల(Public Health)పై, పరిసరాలపై, మొత్తం వ్యవసాయ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు(Adverse Effects) పడతాయి. ఈ స్థితిలో పురుగు మందుల వాడకాన్ని నియంత్రించడం, వాటికి బదులుగా సేంద్రీయ వ్యవసాయాన్ని(Organic Farming) ప్రోత్సహించడం అవసరంగా మారింది.
రసాయనిక మందుల తెలివిలేని వాడకం అనేక సంక్లిష్ట సమస్యలకు దారితీస్తుంది. ఈ రసాయన శేషాలు పంటల్లో ఉండిపోయి, వాటిని తినే ప్రజల ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తున్నాయి. ఈ శేషాల వల్ల కాన్సర్(Cancer), వంధ్యత్వం, నాడీ వ్యవస్థలో లోపాలు, అంతఃస్రావక వ్యవస్థలో అడ్డంకులు వచ్చే ప్రమాదం ఉంది. మందులు కొట్టే రైతులు సరైన రక్షణ పద్ధతులు పాటించకపోతే వారికి ఊపిరితిత్తుల, చర్మ రుగ్మతలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఉదాహరణకు.. ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ వంటి సంస్థల పరిశోధన పత్రాల ప్రకారం.. తెలంగాణలో రసాయన మందుల వాడకం పరిమితిని దాటుతోంది. రైతులకు శ్వాసకోశ, చర్మ వ్యాధులు వస్తున్నాయి.
ఈ పురుగు మందులు చెడు కీటకాలనే కాక పంటలకు మేలు చేసే స్నేహపూర్వక కీటకాలను, ముఖ్యంగా తేనెటీగలను నాశనం చేస్తాయి. తేనెటీగల సంఖ్య తగ్గడం పరాగ సంపర్కానికి పెద్ద అడ్డంకి కలిగిస్తుంది. తద్వారా పంటల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. ఈ రసాయనాలు భూమిలో, నీటి వనరుల్లో కలిసి కాలుష్యాన్ని పెంచుతాయి. భూసారాన్ని తగ్గించి, భూమి సహజ గుణాన్ని కోల్పోయేలా చేస్తాయి. తెగుళ్లు త్వరగా నిరోధక శక్తిని పెంచుకోవడం వల్ల రైతులు మరింత ఎక్కువ పరిమాణంలో లేదా అధిక విషపూరితమైన మందులను వాడాల్సి వస్తుంది.
దేశంలో వాడుతున్న మొత్తం పంటల రక్షణ మందుల్లో దాదాపు 60 శాతం వరకు పురుగు మందులే. మొత్తం వాడకంలో సుమారు 50 శాతం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ ఈ 4 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమైంది. దీన్ని బట్టి ఈ ప్రాంతాల్లో రసాయన వినియోగం తీవ్రతను గ్రహించొచ్చు. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. మనం ఉపయోగించే మందుల్లో కేవలం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని చేరుతుండగా, మిగతాదంతా పర్యావరణంపై, మానవాళిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాగే, రసాయన మందుల వాడకం పెరుగుతున్నప్పటికీ, పంటల్లో చీడపీడల సమస్య కూడా ఎక్కువ అవుతున్నట్లు సమాచారం తెలుపుతోంది. ఈ చెడు ప్రభావాలను తగ్గించడానికి మరియు ఆరోగ్యకరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి సమగ్ర చీడపీడల నిర్వహణ పద్ధతులు (ఐ.పి.ఎం. వంటి పద్ధతులు) పాటించాలి.
రైతులకు రసాయన మందులకు బదులుగా జీవ నియంత్రణ పద్ధతులు, వేప కషాయం వంటి సహజ కీటకనాశినుల వాడకంపై తప్పకుండా శిక్షణ ఇవ్వాలి. తెగుళ్ల బెడద వల్ల ఆర్థికంగా నష్టం వచ్చే స్థాయికి చేరినప్పుడు మాత్రమే రసాయనాలను వాడేలా ప్రోత్సహించాలి. వ్యవసాయ అధికారులు సూచించిన మందులను, సరైన పరిమాణంలో, సరైన వేళలో, సరైన పద్ధతిలో మాత్రమే వాడాలి. మందుల పట్టీపై ఉన్న సూచనలు, విష తీవ్రత గురించి రైతులకు పూర్తిగా తెలియజేయాలి. మందు కొట్టేటప్పుడు రక్షక దుస్తులు, ముసుగులు, చేతి తొడుగులు తప్పనిసరిగా ధరించేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి.
సేంద్రీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి పరమపరాగత్ కృషి వికాస్ యోజన, ఈశాన్య ప్రాంతంలో సేంద్రీయ విలువ గొలుసు అభివృద్ధి మిషన్ వంటి ప్రభుత్వ ప్రణాళికలను మరింత విస్తృతంగా అమలుచేయాలి. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక సహాయం, నాణ్యమైన సేంద్రీయ వనరులు, విత్తనాలు, ధృవీకరణ ప్రక్రియలో మద్దతు అందించాలి. సేంద్రీయ ఉత్పత్తులకు మెరుగైన విక్రయ అవకాశాలు కల్పించడం ద్వారా రైతులు ఎక్కువ లాభం పొందేలా చూడాలి. పునరుత్పత్తి వ్యవసాయ విధానం వంటి కొత్త పద్ధతులపై పరిశోధనలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించాలి.
ఈ విధానం హానికరమైన రసాయనాల వాడకాన్ని తగ్గించి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పురుగు మందుల నియంత్రణ, సేంద్రీయ వ్యవసాయ ప్రోత్సాహం అనేది కేవలం రైతుల బాధ్యత మాత్రమే కాదు. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, వినియోగదారులుగా మనందరి సామూహిక బాధ్యత. ఆరోగ్యకరమైన పంటలు, ఆరోగ్యకరమైన భూమి, ఆరోగ్యకరమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజం కోసం రసాయనాలు లేని వ్యవసాయం వైపు అడుగులు వేయడం ఈ కాలం అవసరం.
