Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeసాహిత్యంఊరు వాడలకే అందాలు ఊర పిచ్చుకలు

ఊరు వాడలకే అందాలు ఊర పిచ్చుకలు

20 మార్చి “ప్రపంచ ఊరపిచ్చుకల దినం” సందర్భంగా

గ్రామీణ మానవ నాగరికతతో విడదీయరాని బంధాలను పెనవేసుకున్నాయి చలాకీ బుల్లి అందాల ఊర పిచ్చుకలు. ఇంటి కిటికీలు, బాల్కనీలు, పెరటి తోటలు, పూల చెట్లు, గేట్లు, చేదబాయి, పిట్టగోడల వెంట ఉదయమే దర్శనమిస్తూ ఆ ప్రాంతాలకు శోభను చేకూర్చుతుంటాయి అందమైన ఊర పిచ్చుకలు. గ్రామీణుల కుటుంబ సభ్యుల వలె ఇంటి చుట్టు తిరుగుతూ, ఎగురుతూ, కిలకలారావాలు చేస్తూ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ ప్రకృతి మాత నుదుటిని అందమైన బొట్టు వలె ఆనందాల విందులు వడ్డిస్తుంటాయి ఈ చిట్టి పక్షులు. నేటి ఆధునిక డిజిటల్‌ పోకడలతో ఊర పిచ్చుకల సంఖ్య తగ్గుతూ గ్రామాల్లో సహితం పలుచబడుతున్నాయి.

ప్రకృతి చిట్టి పక్షి దూతకు నివాళులు :
ఇలాంటి అద్భుత పక్షిజాతిని కాపాడుకోవాలనే నినాదంతో ‘నేచర్‌ ఫర్ఎవర్‌ సొసైటీ’ చొరవతో ప్రతి ఏట 20 మార్చిన “ప్రపంచ ఊరపిచ్చుకల దినం లేదా వరల్డ్‌ స్పారో డే”ను 2010 నుంచి పాటించడం ఆనవాయితీగా మారింది. జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు, విద్యావంతులు, జీవవైవిధ్య హితవరులు, భాద్యతగల పౌర సమాజం కలిసి ప్రతి ఏట ప్రపంచ ఊరపిచ్చుకల దినం వేదికగా వాటి పరిరక్షణ ప్రాధాన్యాన్ని వివరించడం, పిచ్చుకల పరిరక్షకులకు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. 2025 ప్రపంచ ఊర పిచ్చుకల దినం ఇతివృత్తంగా “ప్రకృతి చిట్టి పక్షి దూతకు నివాళి” అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతున్నది. విత్తనాల వ్యాప్తి, క్రిమికీటకాలుపట్ట నివారణ, పుష్ప ఫలదీకరణం లాంటి ప్రయోజనాలను కల్పిస్తున్న ఊర పిచ్చుకలను కాపాడకపోవడం మన కనీస కర్తవ్యం. ఊర పిచ్చుకలకు ఆహారంగా వరి గొలుసులు ఇళ్ల పందిళ్లకు, కిటికీలకు అమర్చటం, గింజలను వేయడం, నీటి వసతులు కల్పించడం, వాటితో అనుబంధాలను పెనవేసుకోవడం కొనసాగుతున్నది. నేడు గ్రామాలు, పట్టణాల్లో గార్డెన్స్‌, పచ్చని చెట్లు, హరిత వనాలు, గడ్డి మైదానాలు, అటవీ ప్రాంతాల్లో ఊర పిచ్చుకలకు ఆవాస వాతావరణం కల్పించాలనే ప్రయత్నాలు చేయడం జరగాలి.

ఊర పిచ్చుకల ఆవాసాలను కాపాడుదాం:
ఆధునిక విచక్షణారహిత ఆలోచనలు కలిగిన మానవ సమాజంలో జీవావరణం, జీవవైవిధ్యాలకు తీవ్ర విఘాతం కలగడంతో పక్షులు, చిత్ర జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. విమాన కదలికలు, ఆకాశంలో పతంగుల నాట్యాలు, సెల్‌ టవర్స్ వికిరణాలు, యంత్ర వాహన రణగొణ ధ్వనులు, పర్యావరణ కాలుష్యం, పక్షుల వేటగాళ్లు, పక్షుల అక్రమ రవాణా, అడవుల నరికివేత, మానవుల ఆధునిక జీవనశైలి, పక్షులకు ఆహారం వేయకపోవడం లాంటి కార్యాలతో జీవుల మనుగడ ప్రమాదంలో పడుతున్నది. మగ పిచ్చుకల ఆకారం ఆడ పిచ్చుకల కన్న పెద్దగా ఉండడం, మగ పిచ్చుకలు గూడు కట్టి ఆడ పిచ్చుకలను ఆహ్వానించడం లాంటి అబ్బుర పడే సన్నివేశాలు చూస్తుంటాం.

వృక్షశాస్త్ర వర్ణన ప్రకారం పిచ్చుకలను శాస్త్రీయంగా ‘పస్సరిడే’ కుటుంబంగా, ఊర పిచ్చుకలను ‘పస్సెర్‌ డొనెస్టికా’ ఉపజాతిగా వర్గీకరిస్తారు. పిచ్చుకల ఆవాస ప్రాంతాలను కాపాడుతూ, వాటి ఆరోగ్యకర జీవనాలకు ఊపిరి పోద్దాం.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, 9949700037

RELATED ARTICLES
- Advertisment -

Latest News